కొబ్బరి నువ్వుల పచ్చడి


      కొబ్బరిలో మన శరీరానికి అవసరమైన ఎన్నోరకాల ప్రొటీన్లు, ఎంజైములు ఉన్నాయి. ఇందులో ఉండే పీచుపదార్థము మలబద్ధకము, థైరాయిడ్ వంటి సమస్యలకి చక్కగా 
పనిచేస్తుంది.
ఇవే కాకుండా, విటమిన్లు C, E, B1, BE, B5, BY మరియు ఐరన్, సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.

       నువ్వుల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో అమైనోయాసిడ్లు, మాంసకృత్తులు, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. 

కావలసిన పదార్థాలు:
పచ్చి కొబ్బరి - 1/4 కొబ్బరికాయ
తెల్ల నువ్వులు -3 స్పూన్స్
టొమాటోలు - 3
పచ్చి మిరపకాయలు - 7
ఉల్లిపాయ - 1
ధనియాలు - 2 స్పూన్స్
జీలకర్ర - 1/2 స్పూన్
కల్లుప్పు - తగినంత
నూనె - కొద్దిగా

తాలింపు కోసం :
ఆవాలు
మినప్పప్పు
శనగపప్పు
ఎండు మిరపకాయ
కరివేపాకు పొడి

తయారుచేసే విధానం : 
1. ఒక బాణలిలో ధనియాలు, జీలకర్ర వేసి తక్కువ మంట మీద 30  సెకన్లు పాటు వేయించాలి.
తరువాత అందులోనే నువ్వులు వేసి మరొక 30 సెకన్ల పాటు వేయించాలి. నువ్వులు త్వరగా మాడిపోతాయి. స్టవ్ పైన గిన్నె పెట్టి అటూ, ఇటూ తిరగకుండా దగ్గరే ఉండి వాటిని కలుపుతూ దోరగా వేయించుకోవాలి. 
చూడండి...ఇలా వేయించుకోవాలి. వాటిని ఇంకొక ప్లేట్ లోకి తీసి చల్లారనివ్వాలి.
2. అదే బాణలిలో ఒక స్పూన్ నూనె వేయాలి.
అందులో మనం తీసుకున్న ఉల్లిపాయలో సగం వేసి 30 సెకన్లు వేయించాలి.
ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసి 30 సెకన్లు వేయించాలి.

తరువాత టమాటో, పచ్చి మిరపకాయలు, కల్లుప్పు వేసి మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
పై మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. 
3. ముందుగా నువ్వులు, ధనియాలు, జీలకర్ర పొడి చేసుకోవాలి.
తరువాత అంందులో కొబ్బరి, టొమాటో మిశ్రమాన్ని వేసి రుబ్బుకోవాలి.
చివరిగా మిగిలిన సగం ఉల్లిపాయలు వేసి మిక్సీ ఒక తిప్పు తిప్పాలి...😊 Pulse option వాడాలి.

తాలింపు వేయడం :
ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కాక, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ చిన్నగా తుంచి వేసి వేయించాలి.
పప్పులన్నీ వేగాక స్టవ్ ఆపేసి, వెంటనే కరిపేయాకు పొడి వేయాలి. ఇలా చేస్తే కరివేపాకు పొడి చక్కగా వేగి, పచ్చడి మంచి సువాసనతో ఉంటుంది.
తాలింపుని పచ్చడిలో కలుపుకుంటే కొబ్బరి నువ్వుల పచ్చడి సిద్ధం.
  
      అవకాశం ఉన్నవాళ్ళు ఇలాంటి పచ్చడిని రోటిలో నూరుకుంటే ఆ రుచే వేరు. ఒకేసారి ఎక్కువ పచ్చడి చేసి ఫ్రిజ్ లో పెట్టి తినడం కంటే ఒకరోజుకి సరిపడా చేసుకుని తాజాగా తింటే మేలు. మీకు చెప్పడానికి ఇంత పెద్ద ప్రాసెస్ లాగా అనిపించినా, పచ్చడి చేయడానికి పదంటే పది నిమిషాలు సరిపోతుంది. ఈ పచ్చడిని అన్నం, చపాతీ, పూరీ, ఉప్మా, పొంగలి దేనిలోకైనా రుచిగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

Comments