రుబ్బురోలు | Seasoning
ప్రాచీనకాలంలో తెలుగువారి వంటగదిలో రుబ్బురోలుకి ప్రత్యేక స్థానం ఉండేది. రాను రాను నాగరికత పెరిగి, మారుతున్న అవసరాల దృష్ట్యా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపెట్టబడ్డాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాటి వాడకం అనివార్యం అయింది. ఇందులో తప్పేమీ లేదు.
అయితే పాత తరాల వారు వాడిన చాలా వస్తువులు మరుగున పడిపోయి కాలక్రమేణా అవి అంతరించి పోయే ప్రమాదం ఉంది. మనం చిన్నప్పుడు వాడిన చాలా వస్తువులు, ఇప్పుడు మనం వాడడం లేదు. మన చిన్నతనంలో చాలా విరివిగా ప్రతి ఊర్లో దొరికే చాలా వస్తువులు ఇప్పుడు ఎక్కడో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే లభిస్తున్నాయి. వాటిని తయారుచేసే వాళ్ళు కూడా తగ్గిపోయారు.
మీకు మీ అమ్మమ్మలు, నానమ్మలు ఉన్న పెద్ద పెద్ద ఇళ్లు, ప్రతి ఇంటి పెరట్లో పెద్ద పెద్ద రోళ్ళు, తిరగలి, సన్నికల్లు గుర్తుండే ఉంటాయి. అప్పట్లో మిక్సీలు, గ్రైండర్లు లేవు. పచ్చడి చేయాలన్నా, ఇడ్లీలు దోసెలు చేయాలన్నా రోలు దగ్గరికి వెళ్ళాల్సిందే. కొంత సమయం వెచ్చించి నూరడం, రుబ్బడం చేయాల్సిందే.
ఇప్పుడు మన తరం వచ్చేసరికి అప్పటిలా ఉమ్మడి కుటుంబాలు, విశాలమైన ఇళ్ళు, పెద్ద రోళ్ళు లేవు. ఎక్కడో పల్లెటూర్లలో ఒకటో రెండో ఉన్నాయి. అందుకని ఇప్పుడు అవసరాలకు తగ్గట్టుగా చిన్న చిన్న రోళ్ళు దొరుకుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఈ రోళ్ళు, రోకళ్ళు అవసరమా అనే సందేహం మీకు రావచ్చు. రోలు గురించి ఇంత సేపు మీరు చదువుతున్నారంటే తప్పకుండా మీకు ఇంటరెస్ట్ ఉందని తెలిసిపోయింది. 🤗😀
మీకు ఎప్పుడైనా ఈ సందేహం వచ్చిందా? "నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసిన పచ్చడి రుచి ఇప్పుడు నేను ఎంత ప్రయత్నించినా రావడం లేదు." ఎందుకు అని మీరెప్పుడైనా ఆలోచించారా. అప్పట్లో పచ్చడి రోట్లో నూరేవారు. మీరు గమనించినట్టయితే మనం వాడుతున్న మిక్సీ జార్ లో ఉన్న బ్లేడ్స్ అందులో వేసిన పదార్థాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో అందులోంచి పుట్టే వేడికి కొన్ని ముఖ్యమైన పోషకాలు నశిస్తాయి. రోట్లో దంచడం వల్ల పదార్థాలు నలగబడి అందులో ఉన్న సహజమైన నూనె, పోషకాలు అలాగే ఉంటాయి. పచ్చడి, ఇడ్లీ పిండి వేడెక్కదు. అందుకే రోటి పచ్చడికి అంత రుచి.
ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీకు కావలసిన బుల్లి రోలు తెచ్చుకోండి. ఒక్కసారి ఏ సెలవు రోజో, ఆదివారం పూటో రోట్లో పచ్చడి నూరండి. రుచిలో తేడా మీకే తెలుస్తుంది.
అప్పట్లో రోళ్ళు రుబ్బడం వల్ల చక్కటి శారీరక వ్యాయామంతో పాటు, ఒక పద్ధతిలో రుబ్బడం వల్ల తెలియకుండానే మెదడుకి కూడా పని పడుతుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మెషీన్లు వాడి సమయం ఆదా చేసాము అనుకుంటూ శారీరక వ్యాయామం కోసం జిమ్ ల వెంట పరిగెడుతున్నాము. అదే ఇప్పుడు రోలు ఉపయోగించడం మొదలుపెట్టారే అనుకోండి. ఉదయం పూట మీ జిమ్ టైమ్ ని రోలుకి కేటాయించండి. నోరూరించే పచ్చడితో పాటు వ్యాయామం కూడా చేసినట్టు ఉంటుంది.
నా దగ్గర నాలుగు ఇంచుల చిన్న రోలు ఉంది. దాన్ని అల్లం, వెల్లుల్లి దంచడానికి, అప్పుడప్పుడు పచ్చడి నురడానికి వాడుతుంటాను. అయితే ఆ చిన్న రోలు టమాటో పచ్చడి లాంటివి నురాడానికి బాగుండేది కానీ కొబ్బరి పచ్చడి లాంటివి నూరాలంటే కష్టంగా ఉండేది. అందుకని కొంచెం పెద్ద రోలు కొనాలని అనుకున్నప్పుడు అది పచ్చడికి, కొద్దిమొత్తంలో పిండి రుబ్బటానికి పనికొచ్చేలా ఉంటే బాగుంటుంది అనుకున్నాను.
తిరుపతిలో పెద్ద మార్కెట్ నుండి బస్ స్టాండ్ కి వెళ్లే దారిలో రోళ్ళు అమ్మే చోట ఒక రుబ్బురోలు తీసుకున్నాను. 8 ఇంచుల వెడల్పు, 3 ఇంచుల లోతు, 5 1/2 ఇంచుల రోలు మరియు స్టీల్ పిడి ఉన్న పొత్రం బేరమడగా నాకు 550 రూపాయలకి ఇచ్చారు. ఇక్కడ చేతితో చేసినవి, మెషీన్ కటింగ్ చేసినవి చాలా రకాల రోళ్ళు ఉన్నాయి. వాటిలో నేను నాకు నచ్చిన, అవసరమైన మెషీన్ కటింగ్ రోలు తీసుకున్నాను.
మనం మంచిరోజు, తిథి, సమయం చూసుకుని రుబ్బురోలు మొదలుపెట్టాలి. ఎందుకంటే రోలుని లక్ష్మీదేవిగా కొలుస్తారు. చక్కగా ప్రతి శుక్రవారం, పండగలప్పుడు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు.
రోలుకి ఉన్న రాయి చదునుగా ఉంటే సరిగ్గా మెదగదు అందుకని దానికి పదునైన చీలల వంటి వాటితో రోలు యొక్క పొత్రంని అక్కడక్కడా కొడతారు. దీన్ని 'కక్కు' కొట్టడం అంటారు.
కక్కు కొట్టిన రోలులో సన్నటి ఇసుక ఉండిపోతుంది. నీటితో కడిగితే అది పోదు. ఇలాగే నేరుగా వాడితే ఆ సన్నటి ఇసుక పచ్చడి లేదా పిండిలో కలిసి తినడానికి పనికిరాదు. అందుకని కొత్తరోలుని seasoning చేసుకోవాలి.
మొదటగా రోలుని నీళ్లతో శుభ్రంగా కడగాలి. రోలుకి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మొదటగా బియ్యం వేసి దంచాలి.
తరువాత వరి పొట్టు లేదా చెక్క పొట్టు వేసి మెత్తగా దంచాలి. నా దగ్గర వరి పొట్టు లేదు, చెక్క పొట్టు లేదు అందుకని చెనిక్కాయల పొట్టు వేసి మెత్తగా దంచాను. ఇలా రెండుసార్లు చేసాను. మూడవసారి చెనిక్కాయల పొట్టుని నీళ్లు వేసుకుంటూ మెత్తగా రుబ్బాను. ఇప్పుడు నీళ్లు కలుపుకుంటూ అన్నం రుబ్బాను. నల్లటి మట్టి కలిసి అన్నం మెత్తటి పేస్ట్ లా మారుతుంది. తరువాత నానబెట్టిన బియ్యం వేసి రుబ్బుకోవాలి. ఇది కూడా వాడుకోవడానికి పనికి రాదు.
ఇప్పుడు రోలుని శుభ్రంగా కడగాలి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.
Seasoning చేయడం అయ్యాక కక్కు కొట్టిన పొత్రం smooth గా మారుతుంది.
మరుసటి రోజు నుండి పిండి కానీ, పచ్చడి కానీ రుబ్బుకోవచ్చు.
Robbu rolu ekkada dorukuthai
ReplyDelete