చిట్టికథ - మిగిలిన ఒక్క గ్లాస్ రాగి అంబలి


రోజు నాకు ఆఫీస్ కి టైం అయిపోయింది. పైగా ఈరోజనగా బైక్ లేదు నడిచి వెళ్ళాలి. ఎండాకాలం మొదలైపోయింది. ఎంత వేగంగా నడిచినా సరే పది నిమిషాలైనా పడుతుంది. ఇంకా టిఫిన్ తినలేదు. టైం చూస్తే 10.15 అయింది. 10.30 గంటల కల్లా ఆఫీస్ లో ఉండాలి.  త్వరత్వరగా రెండు గ్లాసుల అంబలి తాగి ఉదయం అల్పాహారం అయింది అనిపించాను. ఒక్క గ్లాస్ అంబలి మిగిలింది. సరే దీని సంగతి తర్వాత చూద్దాం అనుకుని వేగంగా బయటికి వచ్చి తలుపుకి తాళం వేశాను.

మెయిన్ గేట్ వైపు వెళ్తుండగా ముసలమ్మ పెద్ద వెదురు బుట్ట నిండుగా నాటు కొత్తిమీర కట్టలు మోసుకుని వచ్చి, నన్ను కొనమని అడిగింది. కానీ నిన్ననే రైతుబజార్ లో కొన్న నాటు కొత్తిమీర అలాగే వుంది. "ఇంట్లో ఉంది. వద్దమ్మా" అని చెప్పాను. అదీకాకుండా లేట్ అవుతోందనే తొందరలో ఉన్నాను కాబట్టి ఇంట్లో లేకపోయినా కొని ఉండను. ఆమె నెమ్మదిగా ఏదో అడిగింది. ఆమె చెప్పింది నాకు అర్థం కాలేదు. రైతుబజార్ లో "నాటు ఆకు అని చెప్తే నిన్ననే ఒక కట్ట తీసుకున్నాను అమ్మా" అని చెప్పాను.

ఆమె నెమ్మదిగా "రాత్రి మిగిలిన అన్నం ఏమైనా ఉందా" అని అడిగింది. ఒక్క క్షణం అయ్యో లేదే అని మనసు చివుక్కుమంది. మరుక్షణం ఇంట్లో మిగిలి ఉన్న ఒక్క గ్లాస్ రాగి అంబలి గుర్తొచ్చింది. ఒకవైపు ఆఫీస్ కి నడిచి వెళ్ళాలి, టైం కి వెళ్ళాలి, లేటుగా వెళ్లడం నాకు ఇష్టం లేదు. పాపం నోరు తెరిచి అడిగింది. సరే లేట్ అయితే అయింది అనుకునిఅంబలి ఉంది తాగుతావా అమ్మాఅని అడిగాను. ఇది వినగానే ఆమె మొహం ఆనందంతో విప్పారడం గమనించాను. “తీసుకురా తల్లీఅని చెప్పింది.

నేను చాలా వేగంగా ఇంటి తలుపు తీసి, రెండు అడుగుల్లో వంటగదికి వెళ్లి అంబలి ఒక గ్లాస్ లో పోసాను. బయటికి వచ్చేసరికి ఆమె బుట్ట కిందకి దించుకుని, సందులో ఉన్న కుళాయి దగ్గర మొహం, చేతులు శుభ్రం చేసుకుని రాసాగింది. ఆమెకి గ్లాస్ ఇచ్చిమెట్లమీద కూర్చోని నెమ్మదిగా తాగమ్మా. నాకు ఆఫీస్ టైం అయిపోయింది. నడిచి వెళ్ళాలి. తాగిన తర్వాత గ్లాస్ ఇంటి బయట పెట్టు. తర్వాత తీసుకుంటాను.” అని చెప్పి తలుపు తాళం వేయడానికి వెళ్ళాను.

అంబలి కొంచెం తాగి గంగమ్మ తల్లికి అంబిలి పోసినట్టు  పోసినావు తల్లీ. ఇది కదా శాశ్వతం.“ అంటూ సంతోషంగా తాగుతోంది. అది వినినీ కోసమే సరిగ్గా ఒక్క గ్లాస్ అంబలి రోజు మా ఇంట్లో మిగిలినట్టుంది.” అనగానే ఆమె చిక్కటి చిరునవ్వు నవ్వింది.

కొసమెరుపు : నేను ఆఫీసుకి సరైన సమయానికి చేరుకున్నాను. నడిచినంత సేపు ముసలమ్మ చిక్కటి చిరునవ్వు మనసుకు హాయినిచ్చింది. తలుపు తాళం తీసి, అంబిలి గ్లాసులో పోసి ముసలమ్మకి ఇచ్చి, మళ్ళీ తలుపు తాళం వేయడానికి ఒక్క నిమిషం అయ్యుంటుంది. అంత మండుటెండలో మేము తాగగా మిగిలిన ఒక్క గ్లాస్ అంబలి ముసలమ్మకి శక్తినిచ్చింది. ఇలాంటి విషయాల్లో  ఆఫీసుకి లేటుగా వెళ్లి కథలల్లి చెప్పినా ఫరవాలేదు కదా.

Comments

Popular Posts