నువ్వులు, మునగాకు పొడి | Sesame seeds moringa powder
ప్రతిఒక్కరు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదార్థాలతో తయారుచేసిన నువ్వులు, మునగాకు పొడిలో ఉన్న పోషక విలువలు మరియు ఉపయోగాలు తెలుసుకుందాము.
నువ్వులు :
1. నువ్వుల్లో ఐరన్, కాల్షియమ్, ఫైబర్, విటమిన్ B, E పుష్కలంగా ఉంటాయి.
2. వీటిలో ఉన్న ప్రోటీన్ శాకాహారులకి చాలా ఉపయోగం.
3. మెగ్నీషియం మరియు ఇతర న్యూట్రీయెంట్స్ మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయ పడుతుంది.
4. రక్తహీనతని, మలబద్దకాన్ని, శ్వాస సంబంధమైన సమస్యలని తగ్గించడంలో తోడ్పడుతుంది.
5. నువ్వులు ఎముకలకి బలాన్ని, చర్మానికి నిగారింపుని ఇవ్వడంలో ఉపయోగ పడుతుంది.
మునగాకు :
1. మునగాకులో కాల్షియమ్, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ A, B1, B2, BE, C లభిస్తాయి.
2. వీటిలో cells damage ని అడ్డుకుని, immunity ని పెంచే గుణాలున్న anti-oxidents పుష్కలంగా ఉన్నాయి.
3. High B.P, ఉదర సంబంధిత సమస్యలు, అనీమియా, లివర్ సమస్యలని తగ్గిస్తుంది.
4. దెబ్బలు తగినప్పుడు అవి త్వరగా మానడనికి సహాయపడుతుంది.
5. బాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులని నివారించడంలో, ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది.
నువ్వులు, మునగాకు పొడి కమ్మగా ఉంటుంది అయితే చాలామందికి నచ్చకపోవచ్చు. అయినప్పటికీ దీనిలో ఉన్న పోషక పదార్థాల కోసం, అది మనకి చేసే మేలు కోసం తప్పనిసరిగా తినాలి.
కావలసిన పదార్థాలు :
నల్ల నువ్వులు - 50 gms
మునగాకు - ఒక కట్ట
తెల్లగడ్డ - 10 రెబ్బలు
కారప్పొడి - 1 స్పూన్
ఉప్పు - 3/4 స్పూన్
తయారుచేసే విధానం :
1. మునగాకుని చక్కగా ఒలుచుకుని, ఉప్పు వేసి నీటిలో 10 నిమిషాలు ఉంచి, రెండు సార్లు బాగా కడగాలి. ఇలా కడిగాక, మునగాకుని ఒక పొడిబట్టపైన ఆరబెట్టాలి. ఎండలో పెట్టనవసరం లేదు. ఒకరోజుకే ఇంట్లోనే ఫ్యాన్ గాలికి బాగా ఆరిపోతాయి. మీకు ఆరలేదు అనిపిస్తే ఇంకొక రోజు ఫ్యాన్ కింద ఉంచేయండి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని తక్కువ మంట మీద మునగాకుని ఒక నిమిషం వేయించండి. మరీ ఎక్కువ వేయిస్తే కొన్ని విటమిన్లు నష్టపోతాము. మునగాకు గలగలమని శబ్దం వస్తుంది. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకోవాలి.
3. ముందుగా నువ్వులని పొడి చేసుకోవాలి. నువ్వుల్లో ఉన్న నూనె వల్ల పొడి అవకుండా ముద్దగా అయ్యే అవకాశం ఉంది. అందుకని మిక్సీలో pulse ఆప్షన్ వాడి పొడి చేసుకోవాలి. చివర్లో తెల్లగడ్డ రెబ్బలు వేసి మిక్సీని ఒక తిప్పు తిప్పాలి. అయినప్పటికి కొంచెం ముద్దగా వస్తుంది. ఏమీ భయపడకండి. ఆ నువ్వుల పొడి లేదా ముద్దని ఒక గిన్నెలో తీసుకోండి.
4. తరువాత మునగాకుని వేసి పొడి చేసుకోవాలి. చాలా మంచి సన్నటి మునగాకు పొడి వస్తుంది.
5. నువ్వుల పొడిలో మునగాకు పొడి, ఉప్పు, కారం వేసి చేతితో బాగా కలుపుకోవాలి. ఈ పొడిని గాజుసీసాలో పెట్టుకుంటే రుచి మారకుండా ఉంటుంది.
మీ భోజనంలో మొదటి అన్నం ముద్దని ఒక స్పూన్ నువ్వులు, మునగాకు పొడికి అర స్పూన్ నెయ్యి దట్టించి తినండి. అన్నం తినకపోతే ఇడ్లీ, దోస, ఉప్మా, పొంగల్ లో తినొచ్చు. డైట్ లో ఉంటే ఓట్స్ లో కలిపి తినొచ్చు. లేదా ఒక స్పూన్ పెరుగులో ఈ పొడి వేసి తినొచ్చు. ఇవన్నీ కాదు అంటే ఒక స్పూన్ పొడికి రెండు చుక్కల నెయ్యి వేసుకుని అలాగే తినేయొచ్చు. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఖచ్చితంగా ప్రతి రోజు ఒక స్పూన్ తినాలి కాబట్టి. ఇలా రెండు లేదా మూడు రకాల పొడులని చేసి పెట్టుకుని, ఒక్కోరోజు ఒక్కో పొడితో తిన్నారంటే ఆ రోజుకి కావలసిన పోషక పదార్థాలు అందుతాయి.
ఇలాంటి పొడులని పది లేదా పదిహేను రోజులకి సరిపడా తక్కువ మొత్తంలో చేసుకుంటే బాగుంటుంది. అయిపోయాక మరొక కాంబినేషన్ లో మరొక పొడి తయారుచేసుకోవచ్చు.
Comments
Post a Comment