బచ్చలి కూర పప్పు | Malabar Spinach Dal

      బచ్చలి కూర తీగజాతికి చెందిన మొక్క. ఈ మొక్క దక్షిణ ఆసియా దేశాల్లో చక్కగా పెరుగుతుంది. చాలామంది ఇంటి పెరట్లో వీటిని పెంచుతారు. బచ్చలి ఆకులు బాగా చలవ చేస్తాయి మరియు మలబద్దకం, రక్తహీనత సమస్యలకి చక్కటి పరిష్కారం. మీకు మార్కెట్ లో దొరికినప్పుడు తప్పనిసరిగా తీసుకుని మీ భోజనంలో భాగం చేసుకోండి. ఇప్పుడు బచ్చలి కూరలో వుండే విటమిన్లు మరియు మినరల్స్ గురించి చూద్దాం.
1. బచ్చలి కూరలో కెలోరీలు మరియు కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. 

2. ఇందులో లభించే సహజసిద్ధమైన పీచుపదార్థాలు జీర్ణక్రియ సాఫీగా జరగడానికి దోహదం చేస్తాయి.

3. విటమిన్ - A, విటమిన్ - C మరియు ఐరన్ శాతం ఎక్కువ.

4. వీటిలో ఫోలేట్ వంటి B - కాంప్లెక్స్ కి సంబంధించిన విటమిన్లు లభిస్తాయి. విటమిన్ B6, రెబోఫ్లోవిన్ కూడా అధికంగా ఉంటాయి.

5. పొటాషియం, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, మాంగనీస్ కూడా ఉన్నాయి.

6. వీటిలో పాలకూరలో ఉన్నట్టుగానే ఆక్సాలిక్ ఆసిడ్ ఉండడం వల్ల మూత్రనాళాల్లో ఆక్సలేట్ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు :
    బచ్చలి కూర - ఒక కట్ట
    కందిపప్పు - 1 కప్
    టొమాటోలు - చిన్నవి 3
    పచ్చి మిరపకాయలు - 3
    చింతపండు - కొద్దిగా
    పసుపు - 1/2 స్పూన్
    కొత్తిమీర - గుప్పెడు
    ఉప్పు - తగినంత

 తాలింపు కోసం : 
    నూనె - 1 స్పూన్
    ఉల్లిగడ్డ - చిన్నది సగం
    ఎండుమిరపకాయ - 1
    వెల్లుల్లి - 7 రెబ్బలు
    ఆవాలు - 1/4 స్పూన్
    మెంతులు - 10 గింజలు
    జీలకర్ర - 1/2 స్పూన్
    కరివేపాకు - 10 ఆకులు

తయారుచేసే విధానం : 

1. కందిపప్పు బాగా కడిగి, గంట సేపు నానబెట్టుకోవాలి.

2. మీకు తగిన సమయం ఉన్నప్పుడు మట్టి కుండలో వండితే చాలా రుచిగా ఉంటుంది. నేను ఆ రోజు కుక్కర్ లో చేసాను. కుక్కర్ లో కందిపప్పు, పసుపు, బచ్చలి కూర, టొమాటోలు, పచ్చి మిరపకాయలు చివరగా చింతపండు వేసి 3 విజిల్స్ రానివ్వాలి.
3. తగినంత ఉప్పు వేసి పప్పుగుత్తితో పప్పుని మెత్తగా నూరుకోవాలి.
4. తాలింపు గిన్నెలో నూనె వేసి కాగాక, తాలింపు కోసం తీసుకున్నవనన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి.

5.  తాలింపుని పప్పులో వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
      వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, పూరీ లోకి కూడా చాలా బాగుంటుంది. మీకు బచ్చలి కూర దొరికితే తప్పకుండా చేసి చుడండి.

Comments