రాత్రి మిగిలిన అన్నంతో ఉదయానికి ఆరోగ్యకరమైన రాగి అంబిలి


          ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో రాగులు ఒకటి. ప్రతి ఊర్లో చిన్న చిన్న దుకాణాల్లో కూడా దొరుకుతుంది. రాగుల్లో ఉన్న పోషకవిలువల గురించి అందరికి తెలిసిందే. రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. రాగుల్లో ఉన్న క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే ఐరన్ రక్తహీనతని దూరం చేయడమే కాకుండా ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్నందువల్ల త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. అందుకని బరువు తగ్గాలనుకునే వాళ్ళు క్రమం తప్పకుండా రాగులని వారి ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలరు.
            రాత్రి వండిన అన్నం మిగిలిపోయిందని పడేయకుండా, మరుసటి రోజు ఉదయానికి ఆరోగ్యకరమైన టిఫిన్ చేసుకోవచ్చు.

           నేను అన్నం రాత్రి 8.30 గంటలకి వండాను. భోజనాలయ్యాక రాత్రి 10.30 గంటలకి ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రొసీజర్ చేసాను. 

కావలసిన పదార్థాలు : 
రాగిపిండి
అన్నం
నీళ్లు
ఉప్పు
పెరుగు
ఉల్లిగడ్డ
పచ్చి మిరపకాయలు
నిమ్మకాయ - సగం

తయారుచేసే విధానం :

1. మిగిలిన అన్నం మునిగేవరకు నీళ్లు పోయాలి. స్టవ్ వెలిగించి ఒక పొంగు వచ్చాక, నాలుగు నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. 
2. అన్నం ఉడికేలోపల ఒక చిన్న గిన్నెలో రాగిపిండి తీసుకుని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం జారుగా కలపాలి.
3. ఉడికిన అన్నంలో ఈ నీళ్లు కలిపిన రాగిపిండిని గరిట తిప్పుతూ కలపాలి. మనం కలుపుతూ ఉండగానే మొత్తం మిశ్రమం ముద్దగా మారిపోతుంది. ఒక నిమిషం పాటు  మూత పెట్టి తక్కువ మంటలో ఉంచి స్టవ్ ఆపేయాలి. 
4. ఈ గిన్నెని అలాగే ఉంచేయాలి. ఇంక నిద్రపోవచ్చు 😀 మిగిలిన ప్రాసెస్ మరుసటి రోజు తెల్లారి చేసుకోవాలి.

5. మరుసటి రోజు, రాత్రి చేసుకున్న రాగి అన్నంలో పెరుగు, ఉప్పు వేసి మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి, అరచెక్క నిమ్మరసం వేసి కలుపుకోవాలి. 
6. ఈ రాగి అంబిలి 2 గ్లాసులు తాగితే కడుపు నిండిపోతుంది. మధ్య మధ్యలో, ఇంట్లో ఉన్న ఏదైనా ఊరగాయ నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

Comments