క్యారెట్ పెసరపప్పు తాలింపు
క్యారట్
పెసరపప్పు తాలింపు
క్యారట్ పెసరపప్పు తాలింపు చూడడానికే కాదు, తినడానికి మరింత రుచిగా ఉంటుంది. క్యారట్ లో వుండే పోషకాల గురించి మన చిన్నప్పటి నుండి వింటూనే వున్నాం కదా. క్యారట్ తింటే కళ్లు బాగా కనిపిస్తాయి అని మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే వుంటారు.
కావలసిన పదార్థాలు:
- క్యారెట్ - 250 గ్రాములు
- పెసరపప్పు - 50 గ్రాములు
- ఉల్లిగడ్డ - ఒకటి
- పచ్చిమిరపకాయలు - 2
- ఉప్పు - తగిన0త 😀 (అందరూ తగినంత అంటారు ఎంతో చెప్పరు )
- కొత్తిమీర - గుప్పెడు
- ఆవాలు - కొద్దిగా
తయారుచేసే విధానo :
- తాజాగా వున్న క్యారెట్స్ తీసుకుని, వాటిని శుభ్రంగా నాలుగైదుసార్లు కడిగి, తొక్కతీసి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
- ఉల్లిపాయని కూడా పైపొట్టు తీసి, బాగా కడిగి, సన్నగా తరగాలి.
- పచ్చిమిరపకాయలని చిన్నగా కొసి పెట్టుకోవాలి. చెప్పలేదని కడక్కుండా కోస్తారేమో. మనం వంటకి వాడే ప్రతి వస్తువుని, ఆహారాన్ని తప్పనిసరిగా కడగాలి ( ఉప్పు కడిగితే కరిగిపోతుంది కాబట్టి కడగనవసరం లేదు 😉😁 ).
- పెసరపప్పుని కడిగి, మీకు టైం ఉంటే ఒక అరగంట నానబెట్టండి.
- పైన ఫొటోలో కొత్తిమీర లేదే అనుకోకండి, చివర్లో వేస్తాం కాబట్టి అప్పటికప్పుడు తిరిగితే బాగుంటుంది.
- పెసర పప్పుని తగినంత నీళ్ళు పోసి ఉడికించాలి.
2. పొంగు వచ్చిన తరువాత, తక్కువ మంటమీద నాలుగు నిమిషాలు ఉడికించాలి.
3. వెంటనే ఆ నీటిని వంపేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడికిన నీళ్ళని రసం చేయడానికి వాడుకోవాలి.
4. మనం వండబోయే పాత్రని (బాగా కడిగిన 😊) స్టవ్ మీద పెట్టి వెలిగించాలి. నేను మట్టిపాత్రని తీసుకున్నాను.
5. ఒక స్పూన్ నూనె వెసి, కాగాక కొద్దిగా ఆవాలు వేయండి.
6. ఆవాలు చిటపటలాడాక, ఉల్లిపాయలు, మిరపకాయలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
7. తర్వాత క్యారెట్ వేసి వేయించాలి. కింద ఫొటో చూస్తే మీకు ఒక డౌట్ రావాలి. ఇక్కడ మాకు చెప్పకుండా ఏదో పొడి వేసారు ఏమిటబ్బా అని. అదేమిటో మీకు చివర్లో చెప్తాను.
8. తగినంత ఉప్పు వేసి బాగ కలిపి, మూత పెట్టి, క్యారెట్ ఉడికే వరకు వేయించాలి.
9. ఉడికించిన పెసరపప్పుని వేసి, ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి, కలిపి రెండు నిమిషాలు మూత పెట్టండి.
10. చాలా తక్కువ టైమ్ లోనే మనకి కావలసిన పోషక విలువలతో ఉన్న ఎంతో రుచికరమైన క్యారెట్ పెసరపప్పు తాలింపు వారానికి ఒక్క సారైనా చేసుకుని తినాలి.
మీకు చివర్లో నేను వేసిన పొడి గురించి చెప్తాను అన్నాను కదా. అది కరివేపాకు పొడి. మనం కూరల్లో వేసే కరిపాకుని చాలామంది తినరు. "కూరలో కరివేపాకుని తీసేసినట్టు" అనే నానుడి మీరు వినే ఉంటారు. ఒకసారి ఇలా వేసి చూడండి. కూరలో కరివేపాకుని ఎలా తీస్తారో చూద్దాం.,,🤗
Comments
Post a Comment