Brinjal khorma | వంకాయ కుర్మా
వంకాయ కుర్మా అన్నం, పూరీ లోకి చాలా బాగుంటుంది. చపాతిలోకైతే ఇంక చెప్పక్కర్లేదు. సూపరో సూపర్. కావాల్సిన పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి అనిపించినా చేసే ప్రాసెస్ చాలా చాలా సింపుల్.
కావాల్సిన పదార్థాలు :
వంకాయలు - 5
ఉల్లిగడ్డ - 1 చిన్నది
కరివేపాకు - కొంచెం
పేస్ట్ కోసం :
ఎండుకొబ్బరి - 1/2 చిప్ప
ఉల్లిగడ్డ - 1 పెద్దది
టొమాటోలు - 2 మీడియంవి
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
పల్లీలు - గుప్పెడు
సోంపు - 1/2 స్పూన్
లవంగాలు - 4
దాల్చినచెక్క - 2 అంగుళాలు
మిరియాలు - 15
బిర్యానీ ఆకులు - 2 చిన్నవి
కరివేపాకు, పుదీనా - కొద్దిగా
కల్లుప్పు - తగినంత
కారం - 1 స్పూన్
ధనియాలపొడి - 2 స్పూన్స్
పసుపు - 1/2 స్పూన్
నూనె - 3 స్పూన్స్
ఆవాలు - 1/4 స్పూన్
తయారుచేసే విధానం :
1. నేను ఇక్కడ కరివేపాకు, పుదీనా నీడకి ఆరబెట్టినవి ఉండడం వల్ల అవి వేసాను. మీ దగ్గర తాజా ఆకులు ఉంటే వాటినే వాడండి. పేస్ట్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ మెత్తగా నూరుకోవాలి.
2. ఆ పేస్ట్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేయాలి. ఉప్పు సరిచూసుకుని అన్నిటినీ బాగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు ఉప్పు నీటిలో నానబెట్టి, బాగా కడిగిన వంకాయలని తీసుకుని, వాటిని తొడిమకి అవతలి వైపు నాలుగు భాగాలుగా అంటే + ఆకారంలో తొడిమకి అంగుళం ముందు వరకు కోయాలి. ఇలా చేయడం వల్ల వంకాయని విడదీస్తే అది పువ్వులా విచ్చుకుంటుంది. వంకాయల్లో పుచ్చులుంటాయి కాబట్టి బాగా చూసి కోయాలి. కోసేటప్పుడు ఏమైనా పుచ్చు వంకాయలు వస్తే వాటిని పుచ్చు పోయేవరకు కోసేసి 🤔 కూరలో వేయకుండా అలాంటి కాయలని పడేయండి. 🤗
4. అలా జాగ్రత్తగా కోసిన వంకాయల్లో మనం ముందుగా తయారుచేసుకున్న పేస్ట్ ని బాగా కూర్చుకోవాలి.
ఈ రెసిపీ మట్టిపాత్రలో చేస్తే చాలా రుచిగా ఉండడమే కాకుండా తక్కువ నూనెతో కూరంతా సమానంగా ఉడుకుతుంది. మట్టిపాత్రని వాడగా వాడగా non-sticky గా మారుతుంది.
3. మట్టిపాత్రలో మూడు స్పూన్ల నూనె పోసి కాగిన తర్వాత అందులో ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడాక, అందులో పేస్ట్ కూర్చిన వంకాయలు వేసి తక్కువ మంటలో మూడు నిమిషాల మూత పెట్టి వేయించాలి. మధ్యలో ఒక నిమిషం తర్వాత ఒకసారి కలపాలి.
4. మూడు నిమిషాల తర్వాత, మిగిలిన పేస్ట్ అంతా వేసి బాగా కలిపి మరో మూడు నిమిషాల వేయించాలి. ఈ పాటికే వంకాయలు బాగా మగ్గుతాయి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి పది నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. స్టవ్ ఆపేసి చివరగా కొత్తిమీర తరుగు వేయాలి.
వంకాయ కుర్మా అంటే చాలా పెద్ద ప్రాసెస్లలా అనిపిస్తుంది కదా. ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి. మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ కూర వండిన రోజు మీరు తప్పకుండా చపాతీ చేస్తారు. 🙂
Yummy,mouth watering
ReplyDeleteThank you
ReplyDelete