Mint Chutney | పుదీనా పచ్చడి

          పుదీనా గుర్తురాగానే మంచి సువాసన గుర్తువస్తుంది. నోటి దుర్వాసన పోగొట్టడంలో దీనికి సాటిలేదు. పుదీనాలో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, A మరియు C విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. పుదీనా మన ఆహారంలో ప్రతిరోజు చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియని క్రమబద్దీకరిస్తుంది, మలబద్దకం సమస్యని నివారిస్తుంది. దగ్గు, జలుబు, తలనొప్పి నివారణలో బాగా పనిచేస్తుంది.
కావాలసిన పదార్థాలు :
పుదీనా - ఒక కట్ట
టొమాటోలు - 5
తెల్లగడ్డ - 20 రెబ్బలు
ఎండు మిరపకాయలు - 8
మెంతులు - 25
జీలకర్ర - 1 స్పూన్
నూనె -2 స్పూన్ల 5 చుక్కలు 😲
కల్లుప్పు - తగినంత

తాలింపు కోసం : 
ఆవాలు
మినప్పప్పు
కరివేపాకు

తయారుచేసే విధానం : 

1. పుదీనా పచ్చడి తయారీలో టొమాటోలు వాడుతున్నాం కాబట్టి ఇనుప బాణాలి వాడకూడదు. మీకు అందుబాటులో ఉన్న బాణాలిలో 5 చుక్కల నూనె వేసి మెంతులు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించాలి. అన్ని బాగా వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

2. బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి, కాగాక గింజలు తీసేసిన టొమాటోలు మరియు తెల్లగడ్డ వేసి వేయించాలి. ఇందులోనే పచ్చడికి సరిపడా కల్లుప్పు వేసి మూత పెట్టి తక్కువ మంటలో ఉడికించాలి. ఒక స్పూన్ నూనెలో ఇవన్నీ వేగుతాయా అన్న సందేహం మీకు అవసరం లేదు. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల టమాటోలలో ఉన్న నీరంతా వచ్చి, ఆ లిక్విడ్ తోనే చక్కగా ఉడుకుతాయి. ఈ మిశ్రమాన్ని నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.

3. అందులోనే పుదీనా కూడా వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. పూర్తిగా డ్రైగా అవ్వకుండా లిక్విడ్ గా ఉన్నా ఫరవాలేదు. 
4. మెంతులు, జీలకర్ర, ఎండు మిరపకాయలు పొడి చేసుకోవాలి. అందులోనే చల్లారిన టమాటో, పుదీనా మిశ్రమం వేసి నూరుకోవాలి. 

5. ఒక స్పూన్ నూనె వేసి ఆవాలు, మినప్పప్పు వేసి వేగాక స్టవ్ ఆపేసి కరివేపాకు వేయాలి. 

          చూసారా... 2 స్పూన్ల 5 చుక్కలు నూనె అంటే నవ్వారు 🤗. ఇంత తక్కువ నూనెతో ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి రెడీ అయ్యింది. అన్నం, చపాతి, ఇడ్లీ, దోస లోకి తింటే చాలా బాగుంటుంది.

Comments