Chicken pot dum biryani
కావలసిన పదార్థాలు :
చికెన్ - 400 gms
ఉల్లిగడ్డ - 1 పెద్దది
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 స్పూన్స్
పసుపు - 1 స్పూన్
ఉప్పు - తగినంత
కారం - 2 స్పూన్స్
ధనియాలపొడి - 1 స్పూన్
పెరుగు - 10 స్పూన్స్
కరివేపాకు - ఒక రెమ్మ
పుదీనా - 10 రెమ్మలు
కొత్తిమీర - 1 కప్పు
బిర్యానీ ఆకు - 4
లవంగాలు - 10
దాల్చినచెక్క - 4
సోంపు - 1 స్పూన్
బిర్యానీ మసాలా దినుసులు - తగినన్ని
1. చికెన్ marination
ముందుగా చికెన్ ని ఐదుసార్లు పసుపు, ఉప్పు వేసి బాగా కడగాలి. ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాలపొడి, పెరుగు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేయాలి. మనం తీసిపెట్టుకున్న మసాలా దినుసుల్లో సగం వేసి బాగా కలిపి నాలుగు గంటలు ఫ్రిడ్జ్ లో నానబెట్టాలి.
తరువాత బాసుమతి బియ్యం బాగా కడిగి, ఒక గ్లాసుకు మూడు గ్లాసుల శుభ్రమైన నీళ్లు పోసుకోవాలి. అందులో మిగిలిన బిర్యానీ మసాలా దినుసులు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ నూనె, సరిపడినంత ఉప్పు వేసి నానబెట్టాలి.
2. Fried onions
ఉల్లిగడ్డని చాలా సన్నని పొడవైన రేకులుగా తరగాలి. వాటిని నూనెలో వేసి గోధుమరంగు లోకి వచ్చేవరకు వేయించాలి. వాటిని వేయించేటప్పుడు నూనెలో కదుపుతూ వేయించాలి. బయటకి తీసిన తర్వాత ఉల్లిరేకుల్లో అదనంగా ఉన్న నూనెని ఒక గరిటతో వత్తి తీసేయాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిరేకులు చిప్స్ లా కరకరలాడుతూ ఉంటాయి.
3. చికెన్ ని ఉడికించడం
ఒక మట్టికుండ తీసుకుని 3 స్పూన్ల నూనె వేసి అడుగంతా నూనె అంటేలాగా కుండని గుండ్రంగా తిప్పాలి. ఇప్పుడు 4 గంటలు నానబెట్టిన చికెన్ marination కుండలో సమానంగా పరచాలి. పైన సగం వేయించిన ఉల్లిరేకులు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర చల్లి, స్టవ్ పైన పెట్టి మొదటి 2 నిమిషాలు medium మంట మీద, తర్వాత 30 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. ఆవిరి బయటికి వెళ్లకుండా పైన కొంచెం బరువు పెట్టాలి.
4. అన్నం వండటం
కుండలో చికెన్ వేసి స్టవ్ వెలిగించిన 15 నిమిషాల తర్వాత, ఇంకొక బర్నర్ పైన అన్నం వండడం మొదలుపెట్టాలి. బియ్యం పొంగు వచ్చిన తర్వాత 3 నిమిషాలు మీడియం మంట మీద ఉంచాలి. స్టవ్ ఆపేసి గంజి వడగట్టి ఎనభై శాతం ఉడికిన అన్నం పక్కన పెట్టుకోవాలి.
5. దమ్ చేయడం
అన్నం వండడం అయ్యేసరికి చికెన్ అరగంట సేపు ఉడుకుతుంది. మూతతీసి, అందులో సగం అన్నం పరిచి కొద్దిగా ఉల్లిరేకులు, పుదీనా, కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి వేయాలి. మిగిలిన అన్నం కూడా పరిచిన తర్వాత పైన ఉల్లిరేకులు, పుదీనా, కొత్తిమీర, మరొక స్పూన్ నెయ్యి వేయాలి. మూత పెట్టి 15 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. స్టవ్ ఆపేసి బిర్యానీ రెడీ అని అరిచి వెంటనే మూత తీయకుండా అలాగే ఒక 15 నిమిషాలు వదిలేయాలి. ఈ లోపల రైతా తయారుచేసుకోవాలి.
15 నిమిషాల తర్వాత నోరూరించే చికెన్ కుండ బిర్యానీ తినొచ్చు.
Comments
Post a Comment