వాక్కాయ పప్పు | కలేకాయ పప్పు | Carissa carandas Dal
వాక్కాయలను కలేకాయలు, కరండ కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు కూడా అంటారు. సహజంగా అడవుల్లో పెరిగే ఈ చెట్ల నుండి వాక్కాయలు వానకాలంలో వస్తాయి. పచ్చికాయలు వగరు రుచితో ఉంటాయి. దోరగా ఉన్నప్పుడు పుల్లటి రుచి ఉంటుంది. పూర్తిగా పండిన తర్వాత తియ్యగా, కొద్దిగా పుల్లగా ఉంటుంది. పూర్తిగా మాగకుండా దోరగా ఉన్న కాయలు తినడానికి, కూరల్లో వాడడానికి అనువుగా ఉంటాయి.
వాక్కాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ వాక్కాయల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారించగలదు. దంతాలు పుచ్చిపోకుండా మరియు నోటి దుర్వాసన నుంచి కాపాడుతుంది. మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడటంతో పాటు పెప్టిక్ అల్సర్, పొట్టనొప్పిని నివారిస్తుంది. వీటి రసం తాగటం వలన గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.
వాక్కాయలు మీకు ఎప్పుడు మార్కెట్ లో దొరికినా తప్పకుండా తీసుకోండి. వీటిని ఉప్పు, కారం చల్లుకుని తినొచ్చు. అవి చాలా పులుపుగా ఉండడం వల్ల ఎక్కువ కాయలు తినలేము. అందుకని అన్ని రకాల కూరలు, పచ్చళ్ళలో చింతపండుకి బదులుగా నాలుగు కాయలు వేస్తే సరిపోతుంది. పులిహోర కూడా చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు :
కందిపప్పు - 100 gms
వాక్కాయలు - 30
టొమాటోలు - 3 ( మీడియంవి )
పసుపు - 1/2 స్పూన్
కారం - 1 స్పూన్
కల్లుప్పు - తగినంత 😃
కొత్తిమీర
తాలింపు కోసం :
ఆవాలు - 1/4 స్పూన్
వడిమి - కొద్దిగా
తెల్లగడ్డ - 5 రెబ్బలు
కరివేపాకు - ఒక రెమ్మ
తయారుచేసే విధానం :
1. కందిపప్పుని మూడు సార్లు శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి.
2. వాక్కాయలు ఎరుపు, పచ్చని రంగులో చూడడానికి చాలా అందంగా ఉంటాయి. తినడానికి చాలా చాలా పుల్లగా ఉంటాయి. వీటిని కోసినప్పుడు తెల్లని ద్రవం వస్తుంది. అది పోయేలాగా వాక్కాయలని బాగా కడిగి పెట్టుకోవాలి.
3. ఒక్కొక్క వాక్కాయని నిలువుగా కోసి మధ్యలో ఉన్న లేత గింజలని తీసివేయాలి. ఇలా అన్ని వాక్కాయలని కోసిన తర్వాత మీరు గమనిస్తే, మీ చేతి వేళ్ళకు జిగురులాంటి పదార్థం అంటుకుంటూ ఉంటుంది. అందువల్ల వాటిని మరొకసారి బాగా కడగాలి.
4. కండిపప్పు, వాక్కాయలు, టొమాటోలు, పసుపు, కారం అన్నీ కలిపి బాగా ఉడికించుకోవాలి.
5. పప్పు ఉడికాక, అందులో కల్లుప్పు వేసుకుని పప్పుగుత్తితో మెత్తగా చేసుకోవాలి.
6. ఇంకొక చిన్న బాణలిలో 2 స్పూన్ల నూనె వేసి, తాలింపు కోసం తీసుకున్న పదార్థాలన్నింటిని వేసి వేయించుకుని, పప్పులో కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.
7. వేడి వేడి అన్నంలో అర స్పూన్ నెయ్యి తగిలించి వాక్కాయ పప్పుతో తింటే .... ఆహా...చెప్పలేము. మీరు తిని చూడాల్సిందే.
Comments
Post a Comment