వాక్కాయ పులిహోర | Vakkaya pulihora
వాక్కాయలు వానాకాలంలో బాగా దొరుకుతాయి. అడవుల్లో విరివిగా కాసే ఈ కాయలు ఎప్పుడు దొరికినా తీసుకుని, తప్పనిసరిగా మీ ఆహారంలో భాగం చేసుకోండి. విటమిన్ సి అధికంగా లభించడమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
కావలసిన పదార్థాలు :
వాక్కాయలు
ఆవాలు
మినప్పప్పు
శనగపప్పు
జీడిపప్పు
వేరుశనగ పప్పు
నల్ల నువ్వులు
పచ్చి మిరపకాయ
ఎండుమిర్చి
కరివేపాకు
క్యారెట్
పసుపు
ఉప్పు
నూనె
అన్నం
తయారుచేసే విధానం :
అన్నం తయారుచేసే విధానం :
మీ మనసులో మాట నాకు అర్థమైంది. అన్నం వండడం రాకుండానే మేము వంటలు చేస్తున్నాం మరి...😠 అనే కదా అంటున్నారు.😀 నాకు తెలిసిన కొన్ని సీక్రెట్స్ మీకు చెప్తాను. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలిస్తే మీరు నేరుగా పులిహోర తయారీకి వెళ్లిపోవచ్చు.
1. బియ్యం మూడు సార్లు కడిగి, ఒక గ్లాసుకి 4 గ్లాసుల నీళ్లు పోయాలి. అందులో అర స్పూన్ నూనె వేయాలి. ఇక చేయడం వల్ల 4అన్నం అతుక్కోకుండా వస్తుంది. ఈ బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టాలి.
2. అన్నం పొంగిన తర్వాత, స్టవ్ దగ్గరే నిలబడి ఉండాలి. నాలుగు నిమిషాలు తక్కువ మంటలో ఉంచితే అన్నం ఉడికిపోతుంది.
3. గంజి వార్చుకుని, ఒక పళ్ళెంలో అన్నం పరిచి బాగా చల్లారనివ్వాలి.
4. ఇలా పొడి పొడిగా ఉన్న అన్నం పులిహోరకి చాలా బాగుంటుంది. సరి ఎసరు పద్దతిలో అన్నం వండితే మెతుకులు అతుక్కుంటాయి, పొడి పొడిగా రావు.
పులిహోర తయారీ :
1. వాక్కాయలని బాగా కడిగి, ఒక్కో కాయని కోసి, మధ్యలో ఉన్న గింజలని తీసివేసి పక్కన పెట్టుకోవాలి.
2. వాక్కాయలని కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి.
3. తరువాత ఒక బాణలిలో పావు స్పూన్ నూనె వేసి జీడిపప్పు, వేరుసనగపప్పు విడివిడిగా వేయించుకోవాలి. నూనె మిగిలినా, మిగలకపోయినా అదే బాణలిలో కరివేపాకు వేయించుకోవాలి.
4. అర స్పూన్ నూనె వేసి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చి మిరపకాయ వేసి వేయించుకోవాలి. ఇలా అన్నిటినీ విడివిడిగా వేయించుకోవడం వల్ల అన్నీ చక్కగా వేగుతాయి.
5. మిగిలిన నూనెలో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
6. తరువాత అర స్పూన్ నూనె వేసి వాక్కాయ ముద్దని దోరగా వేయించుకోవాలి.
7. ముందుగా వండి చల్లార్చిన అన్నంలో వాక్కాయ ముద్దని వేసి కలుపుకోవాలి. ఉప్పు సరిచూసుకుని వేయించి పెట్టుకున్న పదార్థాలన్నీ కలపాలి.
8. చివరగా ఒక గుప్పెడు నల్ల నువ్వులని తగిలించాలి.
పులిహోర అన్నారు బాగానే వుంది. కానీ పులిహోరలో ఈ క్యారెట్ వేయడం ఏమిటీ, ఆ నల్లనువ్వులు వేయడం ఏమిటీ. ఇలాంటి వింత మేమెక్కడా చూడలేదమ్మా🤗 అనుకుంటున్నారా. మన జిహ్వచాపల్యం కోసం పులిహోర, ఆరోగ్యం కోసం క్యారెట్ మరియు నువ్వులు. తక్కువ నూనెతో, రక రకాల పప్పులు వేసి చేసిన పులిహోర లాంటి పులిహోర ఇది. తప్పకుండా చేసి చూడండి.
Comments
Post a Comment