వెనీలా కేక్ | Vaneela Cake | Without oven | Basic cake
పిల్లలకి కేక్ అంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. ఈ సమయంలో మనం బయట బేకరీలకి వెళ్లి, అక్కడి కేక్స్ ధైర్యంగా తెచ్చి తినలేము కాబట్టి మన దగ్గర ఉన్న పదార్థాలతో బేసిక్ కేక్ తయారు చేద్దాము. ఇక్కడ మనం వాడే పదార్థాలన్నీ మీకు దగ్గరలో ఉన్న షాపులో దొరుకుతాయేమో ప్రయత్నించండి. మీ దగ్గర ఓవెన్ లేదని కేక్ చేయడం మానేయకండి.
కావలసిన పదార్థాలు :
మైదా - 1 కప్
చక్కెర - 3/4 కప్
ఆయిల్ లేదా బట్టర్ - 1/4 కప్
కోడిగుడ్డు - 1
బేకింగ్ పౌడర్ - 1 స్పూన్
బేకింగ్ సోడా - 1/2 స్పూన్
వెనీలా ఎస్సెన్స్ - 1 స్పూన్
కాచి చల్లార్చిన పాలు - 3 స్పూన్స్
టూటీ ఫ్రూటీ - 3 స్పూన్స్
నట్స్ - 3 స్పూన్స్
ఇసుక లేదా ఉప్పు - 1 పెద్ద గ్లాస్
తయారుచేసే విధానం :
1. టూటీ ఫ్రూటీ, నట్స్ ఒక చిన్న గిన్నెలో తీసుకుని, అందులో ఒక స్పూన్ మైదా వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల మనం వీటిని కేక్ మిక్స్ లో వేసినప్పుడు అడుగుభాగానికి చేరకుండా ఉంటుంది. మీకు అందుబాటులో ఉన్న ఎలాంటి నట్స్ అయిన ఇందులో వేసుకోవచ్చు.
2. మిక్సీ జార్ లో నూనె, కోడిగుడ్డు, చక్కెర వేసి చిక్కని పేస్ట్ లా చేసుకోవాలి. Hand blender ఉంటే దాన్నే వాడండి, మిక్సీ అవసరం లేదు.
3. ఆ పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత రెండు నుండి మూడు స్పూన్ల కాచి చల్లార్చిన పాలు వేసి కేక్ మిక్స్ dropping consistency అంటే మరీ జారుడుగా కాకుండా గరిటలో నుండి నెమ్మదిగా కింద పడేంతగా కలుపుకోవాలి. మరీ జారుడుగా ఉంటే టూటీ ఫ్రూటీ, నట్స్ అన్నీ అడుగుకి చేరిపోతాయి.
4. ఇప్పుడు అందులో మొదటి స్టెప్ లో చేసి పెట్టుకున్న టూటీ ఫ్రూటీ, నట్స్ ని కేక్ మిక్స్ లో వేసి కలపాలి.
5. ఒక వాడనటువంటి బాణలి తీసుకుని, అందులో ఇసుక గాని ఉప్పు కానీ వేసి మూత పెట్టి వేడి చేసుకోవాలి. వాడనటువంటి బాణలి దీనికోసం మాత్రం ఎందుకు వాడతాము అంటున్నారా?? మీరు రోజూ కూరలు వండడానికి వాడని మరియు కేక్ మిక్స్ గిన్నె సరిపోయేంత బాణలి తీసుకోవాలి. కేక్ మిక్స్ ఉన్న గిన్నె పెట్టేలోపల ఈ బాణలి లోపల తగినంత వేడి పుడుతుంది అంటే pre heat అవుతుంది.
6. కేక్ మిక్స్ కి రెండింతలు పెద్ద గిన్నె తీసుకుని, గిన్నె లోపలవైపు మొత్తం నూనె లేదా బట్టర్ రాయాలి. ఇలా చేయడం వల్ల కేక్ గిన్నెకి అతుక్కోకుండా సులభంగా వస్తుంది. కేక్ మిక్స్ ని గిన్నెలో వేసి, పైన ఇంకొన్ని నట్స్ వేసుకోవాలి.
7. కేక్ మిక్స్ ఉన్న గిన్నెని pre heat అయిన బాణలిలో పెట్టి మూత మూసి తక్కువ మంటలో 30 నిమిషాల పాటు ఉంచాలి.
8. అరగంట తర్వాత ఒక ఫోర్క్ లేదా టూత్ పిక్ తో గిన్నె అడుగుభాగానికి గుచ్చి చూడాలి. ఏమి అంటుకోకుండా ఫోర్క్ / టూత్ పిక్ బయటికి వస్తే మీ కేక్ తయారైనట్లే.
9. కేక్ బయటికి తీసి 5 నిమిషాలు చల్లారనిచ్చి ఒక కత్తితో కేక్ అంచుల వెంబడి తీసి, ఒక పళ్ళెంలో బోర్లించాలి. కేక్ సులభంగా వస్తుంది.
10. అంతే... కేక్ మీకు కావలసిన విధంగా కట్ చేసి తినేయడమే.
కేక్ మిక్స్ ప్రాసెస్ పనిని మీ పిల్లలకి అప్పగించండి. కేక్ తయారయ్యే విధానం చూసి రుచి కొంచెం అటూ ఇటూ ఉన్నా తినేస్తారు. అలా అని బేకరీలో చేసే కేక్ కి ఏ మాత్రం తీసిపోదు. తప్పకుండా చేసి చూడండి.
Comments
Post a Comment