ఇడ్లీ లోకి రుచికరమైన వడ కర్రీ



     వడ కర్రీ దక్షిణ భారత ప్రాంత ప్రజలకి సుపరిచితం. దీనిని సాధారణంగా ఇడ్లీ, దోస, చపాతీ, పరోటాలోకి తింటూ ఉంటారు. ఇంత రుచికరమైన కూరని ఆరోగ్యకరంగా చేయడానికి ప్రయత్నిద్దాము. వడ కర్రీ పేరులో ఉన్న వడలని తయారు చేయడానికి నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. నేను అలా చేయకుండా, వడలని ఆవిరి మీద ఉడికించాను. ఇలా చేయడం వల్ల రుచిలో ఏ మాత్రం తేడా రాదు మరియు నూనె పదార్థాలతో చేసిన వాటిని దూరం పెట్టవచ్చు.

కావలసిన పదార్థాలు : 

శనగపప్పు - 1 టీ గ్లాస్
ఉల్లిగడ్డ - 1
టమాటో - 1
పచ్చి మిరపకాయ - 1
వెల్లుల్లి - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 స్పూన్
కారం - 1/2 స్పూన్
పసుపు - 1/2 స్పూన్
కరివేపాకు
కొత్తిమీర
పుదీనా
బిర్యానీ ఆకు - 1
దాల్చిన చెక్క - 1 అంగుళం
మిరియాలు - 5
సోంపు - కొద్దిగా
మరాఠీ మొగ్గ - 1
లవంగాలు - 3
అనాస పువ్వు - 1
యాలకులు - 1
జీడిపప్పు - 4
నూనె - 2 స్పూన్స్
తయారుచేసే విధానం : 

1. శనగపప్పు బాగా కడిగి, అరగంట సేపు నానబెట్టాలి.
2. నానిన శనగపప్పు, కారం, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి బరకగా రుబ్బుకోవాలి.
3. ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకుని ఒక చుక్క నూనె రాసి grease చేసుకోవాలి. శనగపప్పు ముద్దని నాలుగు భాగాలుగా చేసుకుని, వాటిని ఇడ్లీ ప్లేటులో పెట్టాలి.
4. ఇడ్లీ పాత్ర సరిపోయే ఒక పాత బాణాలిలో తగినన్ని నీళ్లు పోసి, శనగపప్పు పాత్ర పెట్టి, మూత పెట్టి, మీడియం మంటమీద పది నిమిషాలు ఉడికించాలి.
5. ఉడికిన శనగపప్పుని చేతితో పొడి పొడిగా చేసుకోవాలి. 
6. టొమాటోని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
7. ఒక మట్టిపాత్ర తీసుకుని, నూనె వేసి, కాగాక ఆవాలు, ఉల్లిగడ్డ,  పచ్చి మిరపకాయ, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, జీడిపప్పు, మసాలా దినుసులన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసి వేయించాలి. ఈ వంట చేసేరోజు నా దగ్గర పుదీనా లేదు కానీ పుదీనా పచ్చడి ఉంది. అందుకని అర స్పూన్ పచ్చడిని ఇందులో వాడాను.🤗
8. పైవన్నీ వేగిన తర్వాత, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. పొడి చేసుకున్న శనగపప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసుకుని పది నిమిషాలు ఉడికించాలి.
 
   చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. వేడి వేడి ఇడ్లీలోకి వడ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ప్రయత్నించండి. ఇడ్లీలోకి పల్లీ చట్నీ లేదా కారం తయారీతో పోలిస్తే వడ కర్రీ వండటానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కానీ అన్నీ ముందే రెడీగా పెట్టుకుంటే చాలా సులభంగా చేయవచ్చు.


Comments