మైసూర్ పాక్ / Mysore pak / Sweet
మీరు డైట్ లో ఉంటే ఈ పోస్ట్ చదవకండి. ఎందుకంటే చదివాక మీరు ఈ సులభమైన స్వీట్ తయారు చేయకుండా ఉండలేరు. చేసాక మరి తినకుండా ఉండలేరు. సరైన కొలతలతో చేస్తే స్వీట్ షాప్ లో బాగా చేయి తిరిగిన వాళ్ళు చేసే స్వీట్ కంటే అద్భుతంగా వస్తుంది. అయితే దీనికి కావాల్సింది ఓపిక. ఈ స్వీట్ చేసేటప్పుడు మధ్యలో ఇంకే పనులు చేయడానికి ఉండదు. మీకు అంత టైం ఉన్నప్పుడే చేసుకుంటే రుచికరమైన మైసూర్ పాక్ తినగలరు.
కావలసిన పదార్థాలు :
శనగ పిండి - 1 కప్
చక్కెర - 1 1/4 కప్
నీళ్లు - 1 కప్
నెయ్యి - 1 కప్
తయారుచేసే విధానం :
1. ఒక ప్లేట్ లోపలి వైపు మొత్తం నెయ్యి రాసుకోవాలి. ఈ ప్లేట్ లోనే మైసూర్ పాక్ తయారవుతుంది.
2. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని, శనగ పిండి వేసి తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు వేయించాలి.
3. శనగపిండిని బాగా కలుపుతూ పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి. దీనికి సుమారు 5 నుండి 6 నిమిషాలు పడుతుంది.
4. శనగపిండి ని మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు చక్కెర, నీళ్లు కలిపి ఒక తీగ పాకం వచ్చేవరకు మరిగించాలి.
5. పాకంలో శనగపిండి కొద్ది కొద్దిగా వేస్తూ, ఉండలు లేకుండా కలుపుకోవాలి.
6. ఇప్పుడు 1/4 కప్ నెయ్యి వేసి బాగా కలుపుతూనే ఉండాలి.
7. నెయ్యి మొత్తం ఇంకిపోయాక 1/2 కప్ నెయ్యి వేసి బాగా కలుపుతూనే ఉండాలి.
8. ఈ నెయ్యి కూడా ఇంకిపోయాక మిగిలిన 1/4 కప్ నెయ్యి వేసి కలుపుతూనే ఉండాలి.
9. పిండి గిన్నెకి అంటుకోకుండా వచ్చేవరకు కలపాలి. ఈ టైంలో ఇంకా నెయ్యి వేసినా పిండి పీల్చుకోదు.
10. ఇప్పడు నెయ్యి రాసిన ప్లేట్ లో వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మీకు కావలసిన సైజ్ లో కట్ చేసుకోవాలి.
11. పూర్తిగా చల్లారిన తర్వాత చాలా సులభంగా మైసూర్ పాక్ ముక్కలుగా చేయొచ్చు.
Comments
Post a Comment