రాయలసీమ స్పెషల్ సిరియాలి


      రాయలసీమ స్పెషల్ సిరియాలి చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఉపయోగించిన శనగపప్పు మధుమేహం ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వీటిలో చాలా తక్కువ Glycemic Index (G.I. = 8) ఉంటుంది. అందువల్ల తిన్న వెంటనే శరీరంలో చక్కెర స్థాయిలు పెరగవు. ప్రోటీన్ ఎక్కువగా, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఇందులో ఐరన్, కాల్షియమ్, B విటమిన్లు ఉంటాయి. సులభంగా జీర్ణమయ్యే పదార్ధo.

కావలసిన పదార్థాలు : 
శనగపప్పు - 50 గ్రాములు
వేరుసనగపప్పు - గుప్పెడు
ఉల్లిగడ్డ - 1
వెల్లుల్లి రెబ్బలు - 7
అల్లం ముక్క - 1 అంగుళం
పచ్చి మిరపకాయ - 1
నిమ్మకాయ - 1
తాలింపు దినుసులు - ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు
నూనె - 2 స్పూన్స్
పసుపు - కొద్దిగా
ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం :

1. శనగపప్పు ఒక గంట సేపు నానబెట్టాలి. నానిన శనగపప్పు, అల్లం, పచ్చి మిరపకాయ మరియు తగినంత ఉప్పు వేసి కొంచెం బరకగా రుబ్బుకోవాలి.
2. ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని నూనె రుద్ది, శనగపప్పు ముద్దని పరచాలి.
3. పదిహేను నిమిషాల పాటు మీడియం మంటపై ఆవిరికి ఉడికించుకోవాలి.

4. కొద్దిగా చల్లారిన తర్వాత, పొడి పొడిగా చేసుకోవాలి.

5. ఒక బాణాలి తీసుకుని 2 చుక్కల నూనె వేసి, వేరుసనగపప్పు వేయించుకోవాలి. చివర్లో చిటికెడు కారం, ఉప్పు, దంచుకున్న వెల్లుల్లి వేసి కలుపుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

6. అదే బాణలిలో 2 స్పూన్ల నూనె వేసి తాలింపు కోసం తీసుకున్న దినుసులన్నీ వేసి వేగిన తర్వాత ఉల్లిముక్కలు, పసుపు వేసి వేయించాలి. 

7. తర్వాత పొడిగా చేసుకున్న శనగపప్పు ముద్దని వేసి ఉప్పు సరి చూసుకుని మూత పెట్టి రెండు నిమిషాలు వేయించాలి.

8. నేను ఇప్పుడు అరా చెంచా కరివేపాకు పొడిని వేసాను. స్టవ్ ఆపేసి నిమ్మరసం పిండాలి.

9. ఇప్పుడు వేరుసనగపప్ప, గుప్పెడు కొత్తిమీర తరుగు వేసి వడ్డించుకోవడమే.

      ఇది చాలా సులభమైన పద్ధతి. కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవాళ్ళు శనగపప్పుకు బదులుగా పెసరపప్పు, కందిపప్పు, పెసలు, అలసందులు వేసి చేసుకోవచ్చు. ఎప్పుడైనా తెల్లారి చేసిన ఇడ్లీలు మిగిలితే సాయంకాలం ఫలహారంగా చేసుకోవచ్చు. ఒక పూట భోజనం బదులుగా సిరియాలి తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది.

Comments

Post a Comment