వంకాయ టొమాటో వేపుడు | Brinjal Tomato Curry | Easy recipies

      వంకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరనే చెప్పొచ్చు. గుత్తివంకాయ కూర మీద చాలా సినిమాల్లో పాటలు, డైలాగులు పెట్టారు.  వంకాయలని కూరగాయల్లో మహారాజుగా వర్ణిస్తుంటారు.


1. వంకాయల్లో ఫైబర్, కాపర్, మాంగనీస్, విటమిన్ B6, థయామిన్, ఐరన్ ఉంటాయి.

2. మన శరీరంలో కణాలని నిర్జీవం చేసే ఫ్రీ రాడికల్స్ ని ఎదుర్కొనే antioxidants ని కలిగి ఉంటాయి.

3. వంకాయలు గుండె ఆరోగ్యానికి, రక్తంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉండడానికి, కాన్సర్ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కంటి చూపు మెరుగవడానికి, అధికబరువు తగ్గడానికి ఎంతో బాగా పనిచేస్తాయి.

4. కొంతమందికి వంకాయలు తింటే దురద వంటి చర్మ సంబంధిత అలర్జీలు వస్తుంటాయి. అటువంటి వారు వంకాయలు తరచుగా తీసుకోకపోవడమే మంచిది.

కావలసిన పదార్థాలు : 
     వంకాయలు - 250 గ్రాములు
     ఉల్లిగడ్డ - 1
     టొమాటో - పెద్దది 1
     పసుపు - 1/4 స్పూన్
     కారం - 1/4 స్పూన్
     ధనియాలపొడి - 1/4 స్పూన్
     ఉప్పు - తగినంత
     పల్లీలు - 5 స్పూన్స్
     వెల్లుల్లి - 7 రెబ్బలు
     నూనె - 3 స్పూన్స్
     ఆవాలు - 1/4 స్పూన్
     శనగపప్పు - 2 స్పూన్స్
     కరివేపాకు - 10 ఆకులు
     కొత్తిమీర - గుప్పెడు

తయారుచేసే విధానం : 

1. వంకాయలు బాగా కడిగి, సన్నటి పొడవైన ముక్కలుగా కోసి ఉప్పునీటిలో వేయాలి. నేను ఒక వంకాయని ఆరు ముక్కలుగా కోసాను . ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ నీటిని వంపేసి, కాయలు మునిగే వరకు నీటిని పోసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
2. ఉడికిన వంకాయల్లో నుండి నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఒక బాణలి తీసుకుని నూనె వేసి, ఆవాలు మరియు శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసి గోధుమరంగు వచ్చేవరకు దోరగా వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి, పసుపు, ఉప్పు, కారం, ధనియలపొడి, కరివేపాకు వేసి తక్కువ మంటపై ఉడికించాలి. 

4. మెత్తటి పేస్ట్ లా అయిన తర్వాత వంకాయలని వేసి ఐదు నిమిషాలు వేయించాలి.
5. ఈ లోపులో వేయించిన పల్లీలను రోటిలో వేసి బరకగా దంచుకోవాలి. చివరలో వెల్లుల్లి వేసి దంచాలి.
6. వంకాయలు ఉడికిన తర్వాత, స్టవ్ ఆపేసి దంచిపెట్టుకున్న పల్లీల పొడి, వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి. తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి.
     వంకాయ టొమాటో కూర చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. అన్నంలో పప్పు తో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మనకి దొరికే వంకాయలని బట్టి ఈ కూర రుచి మారుతూ ఉంటుంది. తప్పకుండా చేసి చూడండి.
Related posts : 

Comments