నవారా బియ్యం | ఎర్ర బియ్యం | Navara Rice | Red Rice
నవారా బియ్యం
మన దేశంలో పండించే ఎన్నో రకాల బియ్యం రకాల్లో నవారా బియ్యం కూడా ఒకటి. దీన్నే ఎర్రబియ్యం లేదా Njavara Rice అని కూడా పిలుస్తారు. ఈ పంటని దక్షిణ భారతదేశంలోని కేరళలో ఎక్కువగా పండిస్తారు. దీనిని ఆయుర్వేద మందుల తయారీలో, ఆయుర్వేద చికిత్సలో వాడుతున్నారు. ఇందులో లభించే ఔషధ గుణాల వల్ల ఈ మధ్యకాలంలో అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
నవారా బియ్యంలో మెగ్నిషియం, ఫాస్పరస్, సెలీనియం, థయామిన్, విటమిన్ B6, మాంగనీస్, పీచు పదార్థాలు అధికంగా ఉన్నాయి.
ఈ బియ్యం చూడడానికి ముదురు ఎరుపురంగులో ఉంటాయి.
వరి పంటలో ముందుగా వడ్లు సేకరిస్తారు. వడ్లలో ఉండే పైపొట్టు (husk) బియ్యం గింజ చుట్టూ కవచంలా ఉంటూ దాన్ని రకరకాల వాతావరణ పరిస్థితుల నుండి సంరక్షిస్తుంది. వడ్లనుండి పైపొట్టు వేరు చేసిన వాటిని unpolished rice లేదా brown rice అంటారు. ఈ బియ్యాన్ని polish చేస్తే మనం మాములుగా వాడే తెల్లబియ్యం వస్తుంది. మనకి మార్కెట్ లో double polished rice కూడా దొరుకుతుంది.
నవారా బియ్యం, వడ్ల నుండి పైపొట్టు మాత్రమే తీసిన బియ్యం. పైన చిత్రంలో చూపినట్లు వీటిలో Rice Bran అలాగే ఉంటుంది. Rice Bran లో పలురకాల విటమిన్స్ ఉంటాయి. అందుకే వీటిని కేరళలో ఎక్కువగా ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు.
Geographical Indications Registry వారి అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం కేరళ రాష్ట్రంలో పండే నవారా బియ్యానికి GI ట్యాగ్ ఇవ్వబడింది.
నవారా బియ్యం ఉపయోగాలు :
1. నవారా బియ్యం మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఒక వరమనే చెప్పాలి. నవారా బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకున్న తర్వాత ఆలస్యంగా గ్లూకోస్ గా మారుతుంది. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంటుంది.
2. ఎముకలు ధృఢంగా, కండరాలు బలంగా తయారవడానికి దోహదం చేస్తాయి. తద్వారా Osteoporosis రాకుండా జాగ్రత్త పడవచ్చు.
3. కీళ్ళకి సంబంధించిన ఆర్థరైటిస్ చికిత్సలో ఉపయోగిస్తారు. అనీమియా సమస్య నివారణకు వాడుతారు. పక్షవాతం చికిత్సలో ఉపయోగిస్తారు.
4. నవారా బియ్యం యొక్క వేర్లు చలవ చేస్తుంది కాబట్టి చిన్న పిల్లల్లో మూత్రసంబంధ సమస్యలకి, burning sensation, జ్వరం మొదలైన వాటికి చక్కగా పనిచేస్తుంది.
5. ఈ బియ్యంతో నెయ్యి, బెల్లం వేసి చేసిన పాయసం బాలింతలకు ఇస్తారు. చాలా ప్రాంతాల్లో 6 నెలలు దాటిన పసిపిల్లలకు బరువు పెరిగి ధృఢంగా తయారవడానికి నవారా బియ్యంతో చేసిన ఆహారం ఇస్తారు.
6. నవారా బియ్యం, మునగాకు వేసి చేసిన అన్నం దగ్గు నివారణకు వాడుతారు.
7. నవారా బియ్యం కడిగిన నీటిని తలకి పట్టించి ఒకగంట తర్వాత తలస్నానం చేస్తే premature hair fall సమస్య తగ్గుతుంది.
8. నవారా బియ్యంతో చేసిన అన్నం కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. నిదానంగా జీర్ణమయ్యే గుణం ఉండడం వల్ల చాలా సేపటి వరకు ఆకలి అనిపించదు. దీనివల్ల అనారోగ్యమైన చిరుతిళ్ళకు దూరంగా ఉంటారు. ఒబేసిటీ బారిన పడకుండా ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు.
9. రక్తంలో ఎర్రరక్తకణాలను పెంచడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అందువల్ల అనీమియా పేషేంట్స్ కి ఉపయోగం.
10. ఇందులో ఉన్న చైతన్యపరిచే స్వభావం వల్ల ఇంకా బలంగా, తాజాగా ఉంటారు. దీన్ని anti-aging agent గా పిలుస్తారు.
ఇవి కొన్ని ఉపయోగాలు మాత్రమే. అందుకే ఈ బియ్యాన్ని మన దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి.
నవారా బియ్యం ఉపయోగించి చేసే పదార్థాలు :
మీరు మాములు బియ్యం ఉపయోగించి ఏ ఏ వంటకాలైతే తయారు చేస్తారో అవన్నీ నవారా బియ్యంతో చేసుకోవచ్చు. ఇడ్లీ, దోస, అన్నం, పుట్టు, జావ, మురుకులు, పాయసం, కుడుములు ఇలా అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు.
నవారా బియ్యం జీడిపప్పు, బాదంపప్పు లాంటి పప్పుల వంటి రుచితో ఉండడం వల్ల వాటితో చేసిన వంటకాలు కమ్మగా ఉంటాయి. వైభవ లక్ష్మీ వ్రతం నోచుకునే భక్తులు అమ్మవారికి ఎర్రబియ్యంతో చేసిన చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. కేరళలో ఈ బియ్యంతో చేసిన పుట్టు చాలా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శబరిమల అయ్యప్ప స్వామి వారి ప్రసాదం తయారీలో ఎర్రబియ్యం ఉపయోగిస్తారు.
నవారా బియ్యంతో చేసిన అన్నం వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. బాగా నమిలి తినవలసి ఉంటుంది. Polish బియ్యంతో చేసిన తెల్లటి అన్నం తినే వాళ్ళకి ఈ అన్నం తినడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఇడ్లీ, దోస, జావ, పుట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది.
మీరు కూడా నవారా బియ్యం ఉపయోగించి పలురకాల వంటకాలు చేసి మీ భోజనంలో తినండి. ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు పొందండి. ఆరోగ్యంగా ఉండండి.
Comments
Post a Comment