Red Rice Puttu | ఎర్రబియ్యంతో పుట్టు | నవారా రైస్ పుట్టు
కేరళలో చాలా ప్రసిద్ధి చెందిన ఎంతో రుచికరమైన Red Rice Puttu లేదా ఎర్రబియ్యంతో పుట్టు లేదా నవారా రైస్ పుట్టు తయారీ ఎలాగో చూద్దాం.
కావలసిన పదార్థాలు :
ఎర్ర బియ్యం - 250 గ్రాములు
కొబ్బరికాయ - 1/4 th
బెల్లం - 100 గ్రాములు
యాలకులు - 4
ఉప్పు - చిటికెడు
నెయ్యి - 1 స్పూన్
నీళ్లు - తగినంత
తయారుచేసే విధానం :
1. బియ్యప్పిండి తయారీ
-- ఎర్రబియ్యం నాలుగైదు సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి. కనీసం ఆరు గంటలు నానితే బాగుంటుంది.
-- నీటిని వంపేసి ఒక శుభ్రమైన బట్టపై అరగంట సేపు ఆరబెట్టుకోవాలి.
-- ఆరిన బియ్యాన్ని యాలకులు, ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల పిండి వచ్చింది.
2. పుట్టు తయారీ
-- మీ దగ్గర పిండి రెడీగా ఉంటే పుట్టు తయారు చేయడం ఇడ్లీ చేసినంత సులభం. పిండిలో ఒక్కొక్క స్పూన్ నీళ్లు వేసి కలుపుకోవాలి.
-- పిండి మరీ ముద్దగా అవ్వకుండా, పొడి పొడిగా ఉండేలా కలుపుకోవాలి. పిండిని చేతితో ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి మరియు పొడి పొడిగా ఉండాలి.
-- ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దానిమీద ఒక కాటన్ cloth ని పరిచి పిండిని వేయాలి.
-- తరువాత మిగిలిన cloth తో పిండిని కప్పివేయాలి.
-- దీనిని ఆవిరికి 20 నిమిషాలు ఉడికించాలి.
-- ఈ సమయంలోనే కొబ్బరిని తురుముకోవాలి. బెల్లం కూడా పొడి పొడిగా చేసుకోవాలి.
-- స్టవ్ ఆపిన అయిదు నిమిషాలు తర్వాత పిండిని ఒక పెద్ద పళ్ళెంలో తీసుకుని, అందులో తురిమిన కొబ్బరి, బెల్లం, నెయ్యి వేసి కలుపుకోవాలి.
-- ఇంక పుట్టుని తినడమే ఆలస్యం. ఇది ఒక మంచి అల్పాహారం. ఉదయాన్నే తింటే చాలా సేపటి వరకు ఆకలి అనిపించదు. దీన్ని మనకు నచ్చిన విధంగా గ్లాసులో గానీ గుండ్రటి గిన్నెలో గాని అచ్చులా వేసుకుని పిల్లలకి ఇస్తే వద్దు అనకుండా తినేస్తారు.
-- ఈ పుట్టుని ఎర్రబియ్యంతోనే కాకుండా మీకు అందుబాటులో ఉన్న ఎలాంటి బియ్యంతో అయినా చేసుకోవచ్చు.
Comments
Post a Comment