చిట్టి చిట్టి పునుగులు

     సాయంకాలం పూట తక్కువ సమయంలో చేసుకోగలిగే రుచికరమైన స్నాక్ చిట్టి చిట్టి పునుగులు. మీ దగ్గర ఉన్న పదార్థాలతో చేసి చూడండి. సమయానికి ఇంట్లో కావలసిన పదార్థాలు లేకపోయినా, కేవలం ఇడ్లీ పిండి, ఉప్పు మాత్రమే వేసి చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు : 

ఇడ్లీ పిండి - 300 గ్రాములు
కార్న్ ఫ్లోర్ - 1 స్పూన్
అల్లం - అంగుళం ముక్క
పచ్చి మిర్చి - 1
వాము - 1/2 స్పూన్
బేకింగ్ సోడా - చిటికెడు
ఉప్పు - 1/4 స్పూన్
నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

తయారుచేసే విధానం :

1. దీనికి పెద్ద తయారీ విధానం ఏమీ లేదు. నూనె కాగే లోపల మీరు పిండి కలిపేసుకోవచ్చు.

2. మీ దగ్గర ఉన్న చిన్న రోలులో వాముని దంచుకోవాలి. అలాగే అల్లం ముక్క కూడా దంచుకోవాలి.

3. నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి కలిపుకోవడమే. 
4. నూనె బాగా కాగిన తర్వాత, గోలీ కాయంత పిండి వేస్తే చక్కగా గుండ్రంగా ఉండే చిట్టి చిట్టి బోండాలు తయారవుతాయి.
5. దీనిలోకి అప్పటికప్పుడు చేసిన పచ్చికారం చాలా బాగుంటుంది.

పచ్చికారం తయారీ : మిక్సీ జార్ లో ఒక ఉల్లిగడ్డ, 5 వెల్లుల్లి రెబ్బలు, సగం టమాటో, 7 ఎండు మిరపకాయలు, ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి. దీనికి తాలింపు అవసరం లేదు. 

Comments