చేపల పులుసు | Fish Gravy | Easy method

      మనం చేపల పులుసు చేయాలంటే బాగా నూనె వేసి చూస్తుంటాము. నేను ఇలాగే ఎందుకు చేయాలి అని ఆలోచించి ఇంకోలాగా చేసి చూసాను. రుచి చాలా బాగుండటమే కాదు చేసే విధానం సులభంగా ఉంటుంది. 

      ఈ పద్దతిలో కూడా చాలామంది చేస్తారేమో నాకు తెలీదు. నాకు ఇలా చేయడం చాలా ఈజీ అనిపించింది. రుచి కూడా సూపర్ గా ఉంది. మీకు నచ్చితే ఒకసారి చేసి చూడండి.

కావలసిన పదార్థాలు : 
చేపలు - 600 గ్రాములు
చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజ్ అంత
ఉల్లిగడ్డ - సగం
టొమాటోలు - 2
పచ్చి మిరపకాయలు - 3
వెల్లుల్లి రెబ్బలు - 10
కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపూత - గుప్పెడు
కారం - 2 స్పూన్స్
ధనియాల పొడి - 4 స్పూన్స్
పసుపు - 1/4 స్పూన్
మెంతి పొడి - 1/8 స్పూన్
జీలకర్ర పొడి - 1 స్పూన్
నూనె - 2 స్పూన్స్
ఉప్పు - 1 3/4 స్పూన్

తయారుచేసే విధానం : 

1. చింతపండుని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
2. నానబెట్టిన చింతపండు నుండి రసం తీసి పెట్టుకోవాలి.
3. ఉల్లిగడ్డ, వెల్లుల్లి రెబ్బలు రోట్లో వేసి కచ్చ పచ్చా గా దంచుకోవాలి.
4. ఒక మట్టిపాత్ర తీసుకుని అప్పుడే స్టవ్ పైన పెట్టకండి. మట్టిపాత్రలో చింతపండు రసం, చేపలు, మిరపకాయలు తప్ప మిగిలిన అన్ని పదార్థాలు వేసి చేతితో బాగా కలుపుకోవాలి.
5. తర్వాత చింతపండు రసం కూడా వేసి బాగా కలుపుకోవాలి.
6. ఇప్పుడు మట్టిపాత్రని స్టవ్ పైన పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి.
7. చేప ముక్కలు, మధ్యలో గాటు పెట్టిన పచ్చి మిరపకాయలు పులుసులో వేసుకోవాలి.
8. పదిహేను నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. ఇలా ఉడికేటప్పుడు మట్టి పాత్రపై మూత కొంచెం తెరిచి ఉంచాలి. 
9. పదిహేను నిమిషాల తర్వాత చేపల పులుసు రెడీ అవుతుంది. ఈ చేపల పులుసు తెల్లవారి తయారుచేసి మధ్యాహ్నం భోజనంలో తింటే రుచిగా ఉంటుంది. రాత్రి భోజనంలో తింటే ఇంకా రుచిగా ఉంటుంది.
      మీరు కూడా ప్రయత్నించి చూడండి. 

Related posts :

Comments