చింతకాయ పచ్చడి | Instant Tamarind Pickle


      చలికాలంలో చింతకాయలు ఎక్కువగా దొరుకుతాయి. మీకు మార్కెట్ లో దొరికినప్పుడు తప్పకుండా తీసుకుని పచ్చడి చేసి రుచి చూడండి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో నిలవ పచ్చళ్ళు, ఉరగాయలు చేసుకుని సంవత్సరమంతా తినేబదులు, ఏ కాలంలో దొరికే కాయలతో కొద్దిగా పచ్చళ్ళు చేసుకుంటే అన్ని రకాలు తినొచ్చు. అంతే కాకుండా నిలవ పచ్చళ్ళకి బాగా ఉప్పు, కారం, నూనె దట్టించాలి. ఇప్పుడు చాలా మంది ఉప్పు, కారాలు తినడం తగ్గించేసారు. సీజనల్ పచ్చళ్ళకి ఉప్పు, కారం తక్కువగా వేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే అప్పుడప్పుడు తినవచ్చు.

      చింతకాయల్లో మెగ్నేసియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ B1, B2, B3, B6, C, K, ఫైబర్ లభిస్తాయి. 

కావలసిన పదార్థాలు : 

చింతకాయలు - 1/2 kg
పచ్చి మిరపకాయలు - 20
జీలకర్ర - 1 స్పూన్
ఉప్పు - తగినంత 😄

తాలింపు కోసం :
ఆవాలు
నూనె
పసుపు
ఇంగువ
ఎండు మిరపకాయలు - 2


తయారుచేసే విధానం : 
1. చింతకాయలని బాగా కడిగి, తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి.

2. మీ దగ్గర చిన్న రోలు ఉంటే అందులో చింతకాయలని వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. వాటిలో నుండి ఈనెలు, ముదురుగా ఉన్న గింజలు తీసివేయాలి.
ఇలా దంచినప్పుడు చింతకాయల గుజ్జు కాస్త నల్లబడుతుంది. దీన్ని చూసి భయపడకండి.
3. ఒక బాణలిలో సగం స్పూన్ నూనె వేసి, జీలకర్రని మరియు సగం కోసిన పచ్చి మిరపకాయలని దోరగా వేయించుకోవాలి.
4. చింతకాయల గుజ్జు, వేయించిన మిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. 
5. ఒక బాణలిలో నూనె వేసి తాలింపు కోసం తీసుకున్న దినుసులన్నీ వేసి వేయించాలి. తరువాత పచ్చడిని వేసి ఐదు నిమిషాలు తక్కువ మంట మీద వేయించాలి. 
ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ పింగాణీ జాడీలో కానీ వేసుకుంటే చాలా రోజులు తాజాగా ఉంటుంది. 
వేడి వేడి అన్నంలో తాజా చింతకాయ పచ్చడి వేసుకుని తినాల్సిందే. రుచి అమోఘంగా ఉంటుంది.

Comments