బొంబాయి సాంబార్


     బొంబాయి చట్నీ అంటే చాలామందికి పూరీ కూర అని తెలుసు. మా అమ్మ మా చిన్నప్పుడు ఇడ్లీ లోకి బొంబాయి సాంబార్ తరచుగా చేస్తుండేది. నిజం చెప్పాలంటే నాకు అప్పుడు నచ్చేది కాదు. నేను వంటలు చేయడం మొదలు పెట్టాక ఇడ్లీకి చట్నీ, ఉల్లి టొమాటోల కారం, సాంబార్, చికెన్ పులుసు చేస్తున్నాను. వీటినే మార్చి మార్చి చేసి కొత్తగా ఏమున్నాయా అనుకున్నప్పుడు చిన్నప్పటి బొంబాయి సాంబార్ గుర్తొచ్చింది. మా అమ్మని అడిగి రెసిపీ తెలుసుకున్నాను. అప్పటినుండి అప్పుడప్పుడు మా ఇంట్లో చేస్తున్నాను. అందరూ ఇష్టంగా తింటున్నారు.

కావలసిన పదార్థాలు : 

శనగపప్పు - 3 స్పూన్స్
పుట్నాలు - 2 స్పూన్స్
ఉల్లిగడ్డ - చిన్నది ఒకటి
టొమాటో - 1
పచ్చి మిరపకాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 స్పూన్
పుదీనా, కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా
పసుపు - 1/8 స్పూన్
ఉప్పు - తగినంత😄
నూనె - 2 స్పూన్స్
నీళ్లు - 500 ml
దాల్చినచెక్క - 1 అంగుళం
సోంపు - 1/4 స్పూన్
లవంగాలు - 3
ఆవాలు - 1/4 స్పూన్
తయారుచేసే విధానం :

1. శనగపప్పు బాగా కడిగి, నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.
2. శనగపప్పు, పుట్నాలు, సగం మిరపకాయ, సోంపు, లవంగాలు, దాల్చినచెక్క, పుదీనా కలిపి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
3. ఒక బాణలిలో నూనె వేసి, ఆవాలు చిటపటలాడాక ఉల్లిముక్కలు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, టొమాటో ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి.

4. ఇప్పుడు పేస్ట్ కూడా వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి.

5. నీళ్లు పోసి పది నిమిషాలు ఉడికించుకోవాలి.
6. సిద్ధమైన బొంబాయి సాంబార్ ఒక హాట్ బాక్స్ లో వేసుకుని కొత్తిమీర చల్లుకోవాలి.

      బొంబాయి సాంబార్ వేడిగా ఉన్నప్పుడే ఇడ్లీ లోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఇడ్లీకి పల్లీల చట్నీ, కారం, సాంబార్ కాకుండా అప్పుడప్పుడూ ఇలా బొంబాయి సాంబార్ కూడా ప్రయత్నించండి.

Comments