రాచిప్ప | Kalchatti
రాచిప్ప అనే పేరు ఇప్పటి కాలం వారికి కొంతమందికి తెలిసి ఉండొచ్చు. రెండు తరాల ముందు వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. మీ చిన్నప్పుడు అమ్మమ్మ, నాయనమ్మ ఇళ్లల్లో వాడి ఉంటే అవకాశం ఉంది. రాచిప్ప అంటే రాతితో చేసిన గిన్నె అని అర్థం. తమిళంలో కల్ చట్టి అంటారు. కల్ అంటే రాయి, చట్టి అంటే గిన్నె అని అర్థం.
ఇప్పుడంటే మనకి స్టీల్, ఇత్తడి, అల్యూమినియం, ఇనుము, ఉక్కు, రాగి పాత్రలు విరివిగా లభిస్తున్నాయి. ఇవన్నీ లేనప్పుడు మన పూర్వీకులు మట్టి పాత్రలు ఉపయోగించేవారు. మట్టిపాత్రలతో పాటుగా ఆయా ప్రదేశాల్లో దొరికే రాళ్లను పాత్రలుగా మలిచి వంటకు ఉపయోగించేవారు.
ఇవి ఎక్కడ దొరుకుతాయి ?
1. రాచిప్పలు తమిళనాడులోని మధురై, శ్రీరంగం, చెన్నై, కాంచీపురం నగరాల్లో లభిస్తాయి.
2. ఇప్పుడు ఆన్ లైన్ బిజినెస్ పుణ్యమా అని అమెజాన్ వంటి షాపింగ్ వెబ్ సైట్లలో కూడా ఉన్నాయి అయితే ధర కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు.
3. ఇవే కాకుండా రాచిప్ప తయారీదారులు వివిధ youtube channels లో ఇచ్చిన whatsapp group link ల ద్వారా కూడా orders స్వీకరించి చక్కని packing తో జాగ్రత్తగా మనకి చేరుస్తున్నారు.
4. వివిధ facebook, instagram pages ద్వారా వారిని సంప్రదించి కొనుక్కోవచ్చు.
వీటిని ఇప్పుడు ఎందుకు ఉపయోగించాలి?
1. రాచిప్పలు సహజసిద్ధంగా ప్రకృతిలో లభించే రాతితో చేసిన వంట పాత్రలు. ఇలాంటి వాటిలో వండిన ఆహార పదార్థాల్లో పోషక పదార్థాలు నశించిపోవు.
2. లోహపు పాత్రలలో వండినప్పుడు, కొన్ని పదార్థాలు పాత్రలోని లోహంతో రసాయన చర్య జరిగి కూర రుచి, రంగు, పోషకాలు మారే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఇనుప పాత్రల్లో టమాటో కూరలు చేయలేము. ఇత్తడి పాత్రల్లో చింతపండు వేసిన కూరలు వండలేము. ఇటువంటి రాతి పాత్రలు, మట్టి పాత్రల్లో అలాంటి భయం ఏమీ ఉండదు.
3. మీకు పాతకాలం నాటి వస్తువులు అంటే ఇష్టమా? అయితే మీ దగ్గర తప్పకుండా ఉండాల్సిన వస్తువు ఇది.
4. ఒకవేళ మీకు వారసత్వంగా వచ్చి ఉంటే, మీ పూర్వీకుల జ్ఞాపకార్థం వారు వాడిన పాత్రలు మీరు వాడి మీ ముందుతారాల వారికి కూడా ఇవ్వొచ్చు. ఇవి వంద సంవత్సరాలైనా పాడవకుండా ఉంటాయి.
ఇప్పుడు ఇంకా ఎవరు వాడుతున్నారు?
1. ప్రాచీన వంట పాత్రలు అంటే ఇష్టం ఉండి వాటిని ముందుతరాల వారికి అందించాలనుకునే వాళ్ళు వాడుతారు.
2. పూర్వీకుల గుర్తుగా వాడే వాళ్ళున్నారు.
3. కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దాం అనుకునేవాళ్ళు వాడుతారు.
4. ఆరోగ్య ప్రయోజనాల పట్ల అవగాహన ఉన్నవాళ్లు వాడుతారు.
5. వీటిని కేరళ, తమిళనాడు ప్రాంతాల వాళ్ళు ఇప్పటికీ వాడుతుంటారు.
6. ముఖ్యంగా ఓపిక ఉన్నవాళ్లు వాడుతుంటారు. ఇలా ఎందుకు అన్నానంటే వీటి సంరక్షణ కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది.
వీటిని కొని నేరుగా వంట చేయడం మొదలు పెట్టొచ్చా?
1. మీరు కొన్న వెంటనే మాములు గిన్నెల్లాగా ఒకసారి కడిగి వీటిని వాడలేము.
2. మీరు కొన్న రాచిప్ప pre seasoned అయితే కొన్నవెంటనేతప్పకుండా వాడొచ్చు. Seasoning చేసినవి బాగా నల్లగా ఉంటాయి.
3. Pre seasoned కాకపోతే ఇవి కొన్నప్పుడు తెల్లగా ఉంటాయి. వీటిని 11 రోజుల పాటు seasoning చేస్తే వంట చేయడానికి సిద్ధం అవుతాయి.
వీటి maintainance ఎలా?
1. రాచిప్పలకి పీల్చుకునే స్వభావం ఉంటుంది. అందుకని వీటిని శుభ్రం చేయడానికి సోప్ బేస్డ్ లిక్విడ్ వాడకూడదు.
2. వంట చేసిన తర్వాత నీటితో కడిగి, శనగ పిండి లేదా బియ్యప్పిండి తో తోమి కడగాలి. తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి.
3. రాచిప్పని నేరుగా స్టవ్ పైన పెట్టకూడదు. వాటిలో పులుసు, పప్పు, పులుసు లేదా సాంబార్ లాంటి జారుడు కూరలు చేసుకోవచ్చు.
4. రాచిప్ప వేడెక్కడనికి ఎక్కువ సమయం పడుతుంది. కూర పూర్తి అవడానికి ఐదు నిమిషాల ముందే స్టవ్ ఆపేయొచ్చు. చాలా సేపటి వరకు అందులో కూరలు వేడిగానే ఉంటాయి.
5. వీటిని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. చెయ్యి జారి కింద పడ్డాయంటే రాచిప్పకి పగుళ్లు రావచ్చు, విరిగి పోవచ్చు లేదా మీ ఇంట్లో నేల కూడా పగలవచ్చు. 🤗
విరిగిన రాచిప్పని ఏం చేయాలి ?
1. రాచిప్ప పగుళ్లు వస్తే రాళ్ళ ఉప్పు, చింతపండు, ఎండు మిరపకాయలు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు.
2. విరిగిన రాచిప్ప అడుగున ఒక చిన్న రంధ్రం చేసుకుని ఒక మొక్క పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
3. మరీ ముక్కలు ముక్కలుగా విరిగితే తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేయాలి. ఇంకేమి చేయలేము. 😊😆
రాచిప్ప కాకుండా రాతి పాత్రలు ఏమి ఉంటాయి ?
1. రాతి బాణలి
2. పెరుగు గిన్నె
3. దోస తవ
4. పులి పొంగనాలు పాత్ర
5. గ్లాసులు
6. దీపాలు
Curd pot ని seasoning చేయాల్సిన అవసరం లేదు. గంజి నీళ్లలో ఐదు రోజులు నానబెట్టి, కడిగి పెరుగు తయారు చేసుకోవచ్చు. ఈ పాత్రలో పెరుగు నాలుగు గంటల్లో తోడుకుంటుంది మరియు చాలా సేపు పుల్లగా అవకుండా ఉంటుంది.
ఇటువంటి ప్రాచీన కాలం నాటి వస్తువులు మీ వంటింట్లో ఉంటే చాలా బాగుంటుంది కదా. మీకు దొరికితే తప్పకుండా వాడండి.
Comments
Post a Comment