బీట్ రూట్ పెసరపప్పు వేపుడు | Easy Recipies
బీట్ రూట్ వల్ల మనకు కలిగే ప్రయోజనాల దృష్ట్యా వీలైనంత తరచుగా తీసుకోవాలి. సలాడ్ రూపంలో లేదా జ్యూస్ చేసుకుని తీసుకోవచ్చు. అలా ఇష్టపడని వాళ్ళు కూరలాగా చేసుకోవచ్చు.
బీట్ రూట్ ఉపయోగాలు :
. బీట్ రూట్ లో కాల్షియo, పొటాషియం, ఫాస్ఫరస్ మరియు విటమిన్ A, B1, B2, B3, B9, C లభిస్తాయి.
. బీట్ రూట్ తరచుగా తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
. శరీరంలో రక్తసరఫరా బాగుంటుంది.
. మలబద్దకం సమస్యని తగ్గిస్తుంది.
. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఒక వరం.
. హృదయ సంబంధ వ్యాధులు పెరగకుండా సహాయ పడుతుంది.
. మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఒక మంచి ఆహారం.
. బీట్ రూట్ జ్యూస్ అలసటని తీర్చే ఒక మంచి పానీయం.
పెసరపప్పు ఉపయోగాలు :
. పెసరపప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.
. విటమిన్ A, B, C, E మరియు ఐరన్, కాల్షియం, పొటాషియం లభిస్తాయి.
. బరువు తగ్గాలనుకునే వారికి ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ చాలా ఉపయోగపడతాయి.
. బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది.
కావలసిన పదార్థాలు :
బీట్ రూట్ - 1
పచ్చి మిరపకాయలు - 2
వెల్లుల్లి - 5 రెబ్బలు
పెసరపప్పు - 5 స్పూన్స్
పసుపు - 1/4 స్పూన్
నూనె - 1/2 స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
తయారుచేసే విధానం :
1. పెసరపప్పుని బాగా కడిగి, అరగంట సేపు నానబెట్టాలి.
2. ఈ లోపల బీట్ రూట్ ని చెక్కు తీసి తురుముకోవాలి.
3. పెసరపప్పుని నీళ్లు, పసుపు వేసి ఉడికించాలి. మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం పలుకుగా ఉండాలి. ఇలా రావడానికి మీడియం మంట మీద సుమారు ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది.
4. పెసరపప్పు లోని నీటిని ఇంకొక గిన్నెలోకి వంపుకోవాలి. ఈ నీళ్లు పారబోయకుండా దానితో రసం చేసుకోండి. చాలా బాగుంటుంది.
5. ఒక బాణలిలో నూనె వేసి, కాగిన తర్వాత అందులో బీర్ రూట్ తురుము, పచ్చి మిరపకాయలు మరియు తగినంత ఉప్పు వేసి ఉడికించండి.
6. బీట్ రూట్ ఉడికిన తర్వాత అందులో పెసరపప్పు వేసుకోవాలి.
7. కొద్దిగా ఉప్పు వేసుకుని రెండు నిమిషాలు తక్కువ మంటపై వేయించుకోవాలి. చివరగా స్టవ్ ఆపేసి దంచిన వెల్లుల్లి, కొత్తిమీర వేసుకోవాలి.
బీట్ రూట్ సన్నగా తురుముకున్నాము కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. తక్కువ పదార్థాలు ఉన్నా కూడా పెసరపప్పు వల్ల రుచి చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రయత్నించండి.
Related posts
Comments
Post a Comment